మీ పాలనలో మహిళలకు జరిగిన న్యాయమెంత?

ప్రధానాంశాలు

మీ పాలనలో మహిళలకు జరిగిన న్యాయమెంత?

హోంమంత్రి సుచరిత

ఈనాడు, అమరావతి: ‘మీ పరిపాలనలో మహిళలకు ఎంత న్యాయం చేశారు?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. ‘మా పాలనలో మహిళలపై ఒక్క ఘటనా జరగలేదు. మీరు మహిళలకు రక్షణ కల్పించామంటే ఆధారాలతో చెప్పండి. ఎస్సీ మహిళా హోం మంత్రినైన నాపై అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవం ఉంటే అయ్యన్నను ఏం చేస్తారో చెప్పాలి. ఒక మహిళా మున్సిపల్‌ కమిషనర్‌ను బట్టలూడదీసి కొడతానని మంత్రిగా ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడు అన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాలకే తగరు. అతను గంజాయి అమ్ముకుంటూ సమాజానికి పట్టిన చీడ’ అని విమర్శించారు. శనివారం ఆమె వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో నేరాల రేటు 15% తగ్గిందని జాతీయ నేరరికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం 64% పెరిగిందంటూ సొంతలెక్కలు చెబుతున్నారు. మాస్కులు పెట్టుకోనివాళ్లపై నమోదుచేసిన 80వేల కేసులనూ ఆ లెక్కలో చంద్రబాబు చూపిస్తున్నారంటే ఏమనాలి? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పటి హోంమంత్రి హత్యకు గురయ్యారు, గత ప్రభుత్వ హయాంలోనే ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని చంపారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగింది. నన్ను రాజీనామా చేయాలనడానికి అయ్యన్న ఎవరు? ఒక ఎస్సీ మహిళకు ముఖ్యమంత్రి జగన్‌ హోం మంత్రి పదవి ఇచ్చారు, సామాజిక న్యాయం చేస్తున్నారని కడుపుమంటతో ఇలా మాట్లాడుతున్నారా?’ అని విమర్శించారు.

జోగి రమేష్‌ దౌర్జన్యం చేయడానికి వెళ్లలేదు

ఎమ్మెల్యే జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటివద్దకు వెళ్లిన ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేతకు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి జోగి రమేష్‌ ఒంటరిగా వెళ్లారు. ముట్టడికైతే జనాన్ని తీసుకువెళ్లేవారు కదా? రమేష్‌ కారును పగులగొట్టారు, కారులో నుంచి దిగకముందే ఆయనపై దాడి చేశారు. అక్కడకు వెళ్లింది ఒక్క వ్యక్తే కదా? ఇప్పుడు వాళ్లు (తెదేపా) సీఎం ఇంటిని ముట్టడిస్తాం అంటున్నారు, శాంతిభద్రతలు అనేవి ఉండవా? పోలీసులు ఊరికే చూస్తూ ఉంటారా?’ అని ప్రశ్నించారు.

ఇది ఆరంభం మాత్రమే: జోగి రమేష్‌

‘ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడే భాషను మార్చుకోకపోతే చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా నిరసన తెలుపుతూ ఆయన్ను వెంటాడుతూనే ఉంటాం. శుక్రవారం జరిగింది ఆరంభం మాత్రమే’ అని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ‘రాష్ట్రంలో ఆధార్‌ కార్డు, అడ్రస్‌ లేని చంద్రబాబు, లోకేశ్‌లకు చేతనైతే ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప, ముఖ్యమంత్రిపై బురద చల్లించేందుకు, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చిచ్చు పెట్టాలని ప్రయత్నించడం సరికాదు’ అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు నేను అర్జీ ఇవ్వడానికి వెళ్లడం దండయాత్రా? నా అర్జీని తీసుకుంటే సరిపోయేది కదా? పిరికిపందలా ఇంట్లో కూర్చుని, బయట రౌడీలు, గూండాలు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌కు పాల్పడినవారితో నాపై దాడి చేయించారు. వాళ్లే దాడి చేసి, మళ్లీ మాపై నిందలా? ఇప్పటికైనా చంద్రబాబు ప్రవర్తనలో మార్పు రావాలి. ముఖ్యమంత్రి జగన్‌పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల మీద చంద్రబాబు సీఎంకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అయ్యన్నను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? లేదా సీఎంను బాగా బూతులు తిట్టారని పార్టీలో మీ పదవిని ఆయనకు కట్టబెడతారో మీ ఇష్టం. ఇకపై వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం సహించేది లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న అయ్యన్న లాంటివాళ్లను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మేమూ ఈ అంశాన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని