ఐదుగురు జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ప్రధానాంశాలు

ఐదుగురు జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

గెలిచిన మరో ఎనిమిది మంది
వైకాపా అభ్యర్థులు దాదాపు ఖరారు

ఈనాడు, అమరావతి: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం దాదాపు పూర్తవడంతో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల విజయం అంశం ఆసక్తికరంగా మారింది. అధికార వైకాపా ఇప్పటికే 13మంది అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ ఇప్పటికే ఆ పార్టీలో అంతర్గతంగా జాబితా ప్రచారంలో ఉంది. విజయనగరం, ప్రకాశం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఛైర్మన్‌ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నవారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మిగిలిన 8 జిల్లాలకు చెందిన ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కర్నూలులో ప్రస్తుతానికి తాత్కాలిక ఛైర్మన్‌ను నియమించనున్నారు. ఇక్కడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా ముందుగా నిర్ణయించిన ఎర్రబోతుల వెంకటరెడ్డి మృతి చెందారు. ఆయన కొలిమిగుండ్ల నుంచి పోటీ చేశారు. ఆయనకు ఇవ్వాలనుకున్న జడ్పీ ఛైర్మన్‌ పదవిని ఆయన కుమారుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డికి ఇవ్వాలని వైకాపా అధినాయకత్వం నిర్ణయించింది. అయితే ఉదయ్‌ ఇప్పుడు మళ్లీ పోటీ చేసి గెలవాల్సి ఉంది. అందువల్ల తాత్కాలికంగా ఒకరికి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని.. ఉదయ్‌ గెలిచాక పదవి అప్పగించాలని నిర్ణయించారు.

వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద సందడి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయని వైకాపా నేతలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి చేశారు. కార్యకర్తలు తప్పెట్లు మోగిస్తూ నృత్యాలు చేశారు. బాణసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మరో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలు కట్టిన పట్టం ఈ ఫలితాలని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని