పంజాబ్‌ పగ్గాలు దళిత నేతకు

ప్రధానాంశాలు

పంజాబ్‌ పగ్గాలు దళిత నేతకు

చండీగఢ్‌: పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ (49)ని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేబినెట్‌లో ఆయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. కెప్టెన్‌ స్థానంలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ కొంత మల్లగుల్లాలు పడింది. ఒక దశలో సీఎల్పీ సమావేశాన్ని వాయిదా వేయాలని అనుకున్నా చివరకు ఎన్నిక పూర్తయింది. పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. చన్నీ, రావత్‌, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ తదితర నేతలు గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ను కలిసి సీఎల్పీ నిర్ణయాన్ని తెలియపరిచారు. సోమవారం ఉదయం 11 గంటలకు నూతన సీఎం ప్రమాణం స్వీకరించనున్నారు. అమరీందర్‌కు, సిద్దూకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్న నేపథ్యంలో నూతన సీఎంగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో అధిష్ఠానం కొంత తర్జనభర్జనకు గురైంది. ఒక దశలో తాజా మాజీ మంత్రి సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా పేరు దాదాపు ఖరారైంది. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్తూ మార్గమధ్యంలో ఆగిపోవాల్సి వచ్చింది.చివరకు చరణ్‌జిత్‌సింగ్‌ ఎంపికయ్యారు. ఇటీవల వర్గపోరులో ఆయన మరో ఇద్దరు మంత్రులతో కలిసి సిద్దూ పక్షాన నిలిచారు.

సీఎంగా వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించిన అమరీందర్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆవేదన వెలిబుచ్చారు.


కౌన్సిలర్‌ నుంచి సీఎం వరకు..

చన్నీ (49) పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి కానున్నారు. తొలుత మునిసిపల్‌ కౌన్సిలర్‌గా మూడుసార్లు ఎన్నికయ్యారు. తర్వాత మునిసిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా 2సార్లు సేవలందించి, 2007లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. 2012లో కాంగ్రెస్‌లో చేరాక రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2017లో మూడోసారి నెగ్గారు. చామ్‌కౌర్‌సాహిబ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక సమీకరణాల కోణంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. చన్నీని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అభినందించారు. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌లలో సీఎంలను మార్చడం వల్ల తగిన ఫలితం వస్తుందా అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.


సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా వెళ్లే అవకాశం తనకు లభించినా సున్నితంగా తిరస్కరించానని, ఆ పదవిలో ఒక సిక్కు నేత ఉండాలని అభిప్రాయపడ్డానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అంబికా సోని తెలిపారు. ఈ విషయాన్నే అధిష్ఠానానికి తెలియపరిచినట్లు విలేకరులకు చెప్పారు.


అమరీందర్‌ ఆరోపణలపై ఏం చేస్తారు?: భాజపా

సిద్దూను దేశ వ్యతిరేక శక్తిగా పేర్కొంటూ అమరీందర్‌ సింగ్‌ చేసిన ఆరోపణను పరిగణనలో తీసుకుని చర్యలు చేపడతారా లేదా అని భాజపా ప్రశ్నించింది. ఈ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, కాంగ్రెస్‌ అగ్రనేతలు మాత్రం మౌనం వీడడం లేదని భాజపా సీనియర్‌ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ దిల్లీలో పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుని మీద ఒక సీఎం చేసిన తీవ్ర అభియోగాలపై వైఖరిని కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టం చేయాలన్నారు. గతంలో ఓ ఐఏఎస్‌ అధికారిణికి అభ్యంతరకర సందేశాన్ని పంపించి వివాదంలో చిక్కుకున్న చన్నీని ఇప్పుడు సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని భాజపా ప్రశ్నించింది.


అమరీందర్‌! పార్టీకి నష్టం తేవొద్దు: గహ్లోత్‌

సీఎం పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసినా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, కాంగ్రెస్‌కి నష్టం కలిగించే పనులకు దిగవద్దని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సూచించారు.  


ఇది చరిత్రాత్మకం. పంజాబ్‌కు తొలిసారి దళిత సీఎం రాబోతున్నారు. రాజ్యాంగ/ కాంగ్రెస్‌ స్ఫూర్తికి ఇది నిదర్శనం.

నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, పీసీసీ అధ్యక్షుడు, పంజాబ్‌


రైతు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా సీఎంగా ఉన్నప్పుడు అమలు చేయలేకపోయా.  నూతన ముఖ్యమంత్రి దీనిని సత్వరం పూర్తి చేస్తారని ఆశిస్తున్నా. ఇకపైనా రైతులకు నా అండ ఉంటుంది. 

అమరీందర్‌ సింగ్‌, తాజా మాజీ సీఎం


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని