మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం

ప్రధానాంశాలు

మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం

 వాణిజ్య ఉత్సవంలో మంత్రి గౌతమ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఎగుమతుల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే సదుపాయాలను మారుమూల ప్రాంతాలకూ అనుసంధానం చేసేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ‘వాణిజ్య ఉత్సవం’లో మాట్లాడుతూ.. ‘ఆసియా దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ ఎగుమతుల ఆధారంగా వేగంగా అభివృద్ధి సాధించాయి. మన రాష్ట్రంలో ఐదోవంతున్న తైవాన్‌ ఏటా 330 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగుమతులు సాధిస్తోంది. వాళ్ల స్ఫూర్తితో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఆవిష్కరణలకు.. ఉత్పత్తికి మధ్య ఇంక్యుబేషన్‌ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలి’ అని పేర్కొన్నారు.  


పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలం
- సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, ఆటోమోటివ్‌ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలమైంది. గుంటూరు మిర్చి, కలంకారీ చీరలు, బంగినపల్లి మామిడి, అరకు కాఫీ, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ ద్వారా ప్రత్యేకగుర్తింపు ఉంది. పరిశ్రమ ఏర్పాటు వ్యయాన్ని తగ్గించటం ద్వారా పెట్టుబడుల కేంద్రంగా రాష్ట్రం మారింది.


మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సయంట్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌

ఆర్థిక సంస్కరణలతో దేశంలో పరిస్థితులు మెరుగయ్యాయి. దేశంలో పౌర సదుపాయాలు పెరిగాయి. రాష్ట్రంలో విద్య, నైపుణ్యం, అంకుర సంస్థలను ప్రోత్సహించేలా మూడు అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలి. విశాఖ, తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన బాగుంది. వీటి ఏర్పాటు ఫలితాలు దీర్ఘకాలంలో కచ్చితంగా అందుతాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఎగుమతులను ప్రోత్సహించాలన్న కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డి)పై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.


ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతికి విస్తృత అవకాశం
- అరవింద్‌ గోయెంకా, ప్లెక్స్‌కాన్‌సిల్‌ ఛైర్మన్‌

దేశంలో ప్లాస్టిక్‌ దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీకి కేంద్రం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రస్తుతం 200కు పైగా దేశాలకు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వెళ్తున్నా, ప్రపంచ మార్కెట్‌లో పోలిస్తే మన వాటా చాలా తక్కువ. రాష్ట్రం నుంచి 2020-21లో 181 డాలర్ల విలువైన ప్లాస్టిక్‌ ఎగుమతులు జరిగాయి. భవిష్యత్తులో ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులపై ప్లెక్స్‌కాన్‌సిల్‌ (ప్లాస్టిక్‌ ఎగుమతుల ప్రోత్సాహ మండలి) ద్వారా అవగగాహన కల్పిస్తాం.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని