వెనుకబడిన ప్రాంతాల భక్తులకు బ్రహ్మోత్సవాల్లో దర్శనం

ప్రధానాంశాలు

వెనుకబడిన ప్రాంతాల భక్తులకు బ్రహ్మోత్సవాల్లో దర్శనం

 అక్టోబర్‌ 11న శ్రీవారికి గరుడసేవ
తితిదే ఈవో జవహర్‌రెడ్డి వెల్లడి

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులను ఉచితంగా బస్సుల్లో తీసుకువచ్చి శ్రీవారి దర్శనం చేయించనున్నట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్‌ 7 నుంచి 15వ తేదీ వరకు ఇలా 500 నుంచి వెయ్యి మందికి దర్శనం కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాల్లోగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్న ప్రసాదాలు అందించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్‌ 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, 6న అంకురార్పణ, 7న ధ్వజారోహణం, 11న గరుడ వాహనసేవ, 12న స్వర్ణరథం, 14న రథోత్సవం, 15న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరోవైపు తిరుమలలోని ఉపవిచారణ కార్యాలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను తితిదే ప్రయోగాత్మకంగా మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది.

ఎస్‌ఈడీ టికెట్ల విడుదల రేపు!

అక్టోబరు మాసానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం (ఎస్‌ఈడీ) టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 24న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనుంది. రోజుకు 8 వేల చొప్పున టికెట్లను జారీ చేయనుంది. అయితే టికెట్ల జారీపై తితిదే అధికారికంగా వెల్లడించలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని