రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ రవాణా

ప్రధానాంశాలు

రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ రవాణా

గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌..సీఎం ఇంటి సమీపంలోని సంస్థదే
ప్రజలపై రూ.11 వేల కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం
రైతు విభాగ నేతల సమావేశంలో చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మత్తుమందుల అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, అఫ్గానిస్థాన్‌ నుంచి వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ దిగుమతవుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుజరాత్‌లో పట్టుబడిన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోని టాల్కమ్‌ పౌడర్‌ కంపెనీ పేరుతో దిగుమతయిందని.. దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. డ్రగ్స్‌ వ్యాపారానికి గేట్లు తెరిచి సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చిపెట్టి ప్రజల్ని మళ్లీ మోసం చేయొచ్చని జగన్‌ భావిస్తున్నారని, మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మనం గెలవడం నూటికి నూరుశాతం ఖాయమని.. ఈ దిశగా మనం ప్రజల్ని సన్నద్ధం చేయాలని చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల తెలుగు రైతు విభాగం నాయకులతో ఆయన మాట్లాడారు.

విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన జగన్‌.. ఇప్పుడు సర్దుబాటు (ట్రూ అప్‌ ఛార్జీల) పేరుతో ప్రజలపై రూ.11 వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. దేశంలో చెత్తకు పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌దేనని విమర్శించారు. ‘జగన్‌ పాలనలో ప్రభుత్వ సాయం అందక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలకూ కొరతే. రైతుభరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తానని.. రూ.7,500 మాత్రమే ఇచ్చి రైతుల్ని మోసగించారు. అయిదో విడత రుణమాఫీ సొమ్ము ఎగ్గొట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని మేం రెండు కళ్లుగా ముందుకు నడిపిస్తే.. వైకాపా వచ్చాక వీటిని నాశనం చేశారు’ అని మండిపడ్డారు.

తెదేపా అధికారంలోకి రావాలన్నది ప్రజల ఆకాంక్ష

‘ఆంధ్రప్రదేశ్‌ బాగు పడాలంటే తెదేపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీ అనుబంధ విభాగాలన్నీ కలిసి వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి’ అని చంద్రబాబు రైతు విభాగం నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసేవారికి కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ‘జగన్‌ వచ్చాక పంటల బీమా సమయానికి చెల్లించకుండా రైతుల్ని మోసగించారు. కొంతమంది రైతులకు పంటల బీమా కూడా అందలేదు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకు ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం’ అని తెదేపా నేతలు చెప్పారు. సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీకార దాడులే ఎజెండాగా ముఖ్యమంత్రి జగన్‌ పాలన సాగిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొప్పర్రులో వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారద, కార్యకర్తలు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం చంద్రబాబును కలిశారు. వారిని ఆయన పరామర్శించారు. పోలీసులు కూడా దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టి, దాడికి గురైన తెదేపా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం బత్తిన శారద మీడియాతో మాట్లాడారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినాయక నిమజ్జనం సాకుతో ఏటా మా ఇంటి ముందుకొచ్చి దాడికి పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన మూణ్నెల్లకే నా భర్తను అరెస్ట్‌ చేశారు. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో వైకాపా నాయకులు మా ఇంటిపై పెట్రోలు పోసి తగలబెట్టారు. రాళ్ల దాడితో ఇంటిని ధ్వంసం చేశారు. మమ్మల్ని బయటకు లాగి దాడి చేయాలనుకున్నారు. ఇరుగుపొరుగు వారు రక్షించకపోతే మేం ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. రాళ్ల దాడి జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు ఇప్పుడు మాపైనే కేసులు పెట్టారు. భయపడొద్దు.. అవసరమైతే ప్రైవేటు కేసులు పెడదామని చంద్రబాబు ధైర్యం చెప్పారు’ అని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని