నేలకు వేద్దాం.. జీవన టీకా

ప్రధానాంశాలు

నేలకు వేద్దాం.. జీవన టీకా

 రాష్ట్రంలో 52% నేలల్లో తక్కువగా సేంద్రియ కర్బనం
సేంద్రియ ఎరువుల వాడకంతో పెంచుకునే అవకాశం
ఈనాడు - అమరావతి

మన పంట పొలాల్లో జీవం తగ్గిపోతోంది. పరిమితికి మించిన రసాయన ఎరువుల వాడకంతో భూసారం ఏటికేడు క్షీణిస్తోంది. పైరు ఎదుగుదల, పంట దిగుబడుల్లో కీలకమైన సేంద్రియ కర్బనం నేలలో 0.7% పైన ఉంటే భూమాత ఆరోగ్యంగా ఉన్నట్లు. హరిత విప్లవానికి ముందు ఇలా ఉండేది. రసాయన ఎరువుల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలోని 52% పైగా నేలల్లో సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువగా ఉంది. ఈ కారణంగానే ఎన్ని ఎరువుల బస్తాలను గుమ్మరించినా పైరుకు పట్టడం లేదు. సేంద్రియ, జీవన ఎరువుల వాడకం ద్వారా దీన్ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే వాటికి కొరత ఉండటంతోపాటు ధరలు అధికం కావడంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఉష్ణమండల ప్రాంతం కావడంతో దక్షిణ భారత రాష్ట్రాల నేలల్లో సేంద్రియ పదార్థాన్ని ఎక్కువకాలం నిర్వహించుకోలేని పరిస్థితులున్నాయి. ఇది భూ ఉపరితలం నుంచి అడుగులోపే ఉంటుంది. అక్కడుండే సూక్ష్మజీవుల కారణంగా ఇది విడిపోతోందని, అందుకే ఒకట్రెండేళ్ల తర్వాత మళ్లీ సేంద్రియ పదార్థాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతులు భూసార పరీక్షా కేంద్రాలకు మట్టి నమూనాలు తీసుకెళ్లి.. భూమిలో సేంద్రియ కర్బనం, ఇతర పోషకాల లభ్యతను తెలుసుకోవచ్చు.

అధికశాతం జిల్లాల్లో ప్రమాద ఘంటికలే: అనంతపురం జిల్లాలో మొత్తం 1.08లక్షల పరీక్షలు నిర్వహించగా.. 78% నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంది. కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కుందుర్పి, కంబదూరు తదితర మండలాల్లోనూ సేంద్రియ కర్బనం తగ్గిపోయింది.

* సేంద్రియ కర్బనం అధికంగా ఉండే జిల్లాల్లో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంది. అనకాపల్లి, అనంతగిరి, అరకు, చీడికాడ, చింతపల్లి, దేవరాపల్లి, హుకుంపేట, మునగపాక, పాడేరు, రావికమతం తదితర మండలాల్లోని 80% నుంచి 90% నేలల్లో సేంద్రియ కర్బనం తగినంత ఉంది.
* కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సేంద్రియ కర్బనశాతం అధికంగానే ఉంది. కడప, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లోని నేలల్లో తగ్గింది.

రాష్ట్రంలో 2017-19 మధ్య 14.65 లక్షల భూసార పరీక్షలు చేయగా... 52% భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇందులో 15% నేలల్లో అత్యంత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 23% నేలల్లో మధ్యస్థంగా.. 25% నేలల్లో అధికంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మన్యం ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ కర్బనం 1% నుంచి 2% వరకు ఉంటోంది. అనంతపురం జిల్లాలో మాత్రం 0.1% కూడా ఉంది.


సేంద్రియం... పొలానికి ప్రాణం వంటిది
అపరాలకు రైజోబియం, వరి తదితరాలకు అజోస్ఫైరిల్లం, పండ్ల తోటలకు అజోటో బ్యాక్టర్‌ వాడుకోవచ్చు. అప్పుడు నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. పీఎస్‌బీ(ఫాస్ఫరస్‌ సొల్యూబిలైజింగ్‌ బ్యాక్టీరియా), పొటాష్‌ రిలీజింగ్‌ బ్యాక్టీరియాలు... మొక్కలు గ్రహించని రసాయన ఎరువులను కరిగిస్తాయి. వ్యామ్‌ అనే జీవన ఎరువు సూక్ష్మపోషకాలను మొక్కకు అందేలా చేస్తుంది. ఒక టీకా వలె పనిచేస్తుంది. అమరావతిలో జీవన ఎరువులను పొడి అయితే కిలో రూ.80, ద్రావణమైతే అర లీటరు రూ.150 చొప్పున సరఫరా చేస్తున్నాం. రైతులు ఆన్‌లైన్‌లో నగదు జమ చేస్తే వారింటికే పంపిస్తాం.  

-డాక్టరు లక్ష్మీపతి, జీవన ఎరువుల కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని