నాకు మినహాయింపు ఇవ్వండి

ప్రధానాంశాలు

నాకు మినహాయింపు ఇవ్వండి

కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ ఉంది, రాలేను
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు జగన్‌ వినతి
హాజరైన విజయసాయి, ధర్మాన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశం ఉన్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసుల్లో హాజరు కాలేకపోతున్నానంటూ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. గత నెల లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, వాన్‌పిక్‌ వ్యవహారాలపై ఈడీ నమోదు చేసిన కేసులో కోర్టు సమన్లు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం హాజరుకు మినహాయింపునివ్వాలంటూ జగన్‌ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఈ రెండు కేసుల్లో రెండో నిందితుడైన ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ఐఏఎస్‌ బి.పి.ఆచార్య, మురళీధర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌లు శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ కె.వి.బ్రహ్మానందరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌, జగతి పబ్లికేషన్స్‌ ప్రతినిధిగా కె.బ్రహ్మానందరెడ్డి, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఛైర్మన్‌ శ్రీనివాసబాలాజీ, పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితుడైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాలేదు. కోర్టు విచారణను అక్టోబరు 28వ తేదీకి వాయిదా వేసింది.

వాదనలు వినిపించండి

హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు లేనందు వల్ల అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలంటూ ఇందూ-హౌసింగ్‌ బోర్డు కేసులో నిందితుడిగా ఉన్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ వాదిస్తూ కేసును కొట్టివేయాలంటూ దాఖలుచేసిన పిటిషన్‌ విచారణకు రావడంలేదన్నారు. 2015లో దాఖలైన కేసులతో దీన్ని జత చేశారని, కేసుపై విచారణ చేపట్టాలని అభ్యర్థిస్తే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని, మరో రెండు వారాలు వేచి ఉండాలని చెబుతున్నారని అన్నారు. దీనిపై న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు స్పందిస్తూ హైకోర్టు స్టే ఉత్తర్వులు తెచ్చుకుంటే తమకు అభ్యంతరంలేదని, స్టే లేనందున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలంటూ విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని