ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత

ప్రధానాంశాలు

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ పిటిషన్‌ కొట్టివేత

విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఆయేషా మీరా హత్య కేసులో విచారణ నిమిత్తం ఎనిమిది మందిని నార్కో అనాలసిస్‌ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అధికారులు విజయవాడ నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  కోనేరు సతీష్‌, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సుంకర మురళీమోహన్‌, ఎస్సై గంటి శ్రీనివాసరావు, హాస్టల్‌ సిబ్బంది, హాస్టల్‌లో ఉంటున్న వారిని అనుమతించాలని సీబీఐ అధికారులు కోరారు. తమ విచారణలో వారు నిజాలు చెప్పలేదని, గతంలో కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు ఇలాంటి పరీక్షలకు అనుమతి ఇచ్చాయని అధికారులు వివరించారు. సీబీఐ వాదనలను ఏకీభవించని న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) నార్కో అనాలసిస్‌కు అనుమతివ్వాలని వేసిన పిటిషన్‌నూ ఇదే న్యాయస్థానం కొట్టి వేసిన విషయం తెలిసిందే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని