కొప్పర్రు ఘటనలో ఎవ్వరినీ విడిచిపెట్టం

ప్రధానాంశాలు

కొప్పర్రు ఘటనలో ఎవ్వరినీ విడిచిపెట్టం

నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైను వీఆర్‌కు పంపాం
66 మందిపై కేసులు: రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా జడ్పీటీసీ మాజీ సభ్యురాలి ఇంటిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎవ్వరినీ విడిచిపెట్టమని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. ‘పెదనందిపాడు ఎస్సై నాగేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన తీవ్రత చోటు చేసుకున్నట్లు మా దర్యాప్తులో తేలింది.  ఎస్సైని వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశా. కాకుమాను ఎస్సై రవీంద్రను ఇన్‌ఛార్జిగా నియమించా’ అని ఆయన వివరించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా అక్కడ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్పెషల్‌ బ్రాంచి పోలీసులు ముందే గుర్తించారు. దాంతో బాపట్ల డీఎస్పీ పెదనందిపాడు సీఐని... సీఐ వెంటనే ఎస్సైను అప్రమత్తం చేశారు. అయినా ఎస్సై వెంటనే స్పందించ లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై ప్రశ్నిస్తే మరో ఊరేగింపు జరుగుతోందని, అక్కడ పరిస్థితిని చక్కబెట్టి వచ్చేలోగా ఇక్కడ ఘటన జరిగినట్లు సమాధానమివ్వడాన్ని తీవ్రంగా తీసుకున్నాం. పార్టీ జెండాలతో ముందుగా ఎవరు రెచ్చగొట్టారు? ఎవరు ముందుగా దాడికి పాల్పడ్డారు? ప్రతి నిమిషానికి సంబంధించి దర్యాప్తు చేయాలని ఆదేశించాం. ఆ రోజు రాత్రి నాకు అక్కడి నుంచి ఒకరు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే సీఐని అప్రమత్తం చేయగా... ఆయన అదనపు బలగాలతో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు...’ అని ఎస్పీ వివరించారు. తెదేపా ఫిర్యాదుపై 18 మంది, వైకాపా ఫిర్యాదు మేరకు 48 మందిపై మొత్తం 66 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. బుధవారం గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఏఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తునకు పంపించామన్నారు. ఆయనతోపాటు డీఎస్పీ, ముగ్గురు సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని