శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నీటి వృథా

ప్రధానాంశాలు

శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో నీటి వృథా

తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ‘ప్రస్తుతం నాగార్జున సాగర్‌ దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నా జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తోంది. ఆ నీరంతా సముద్రంలోకి వృథాగా పోతోంది. ఇప్పటికే శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం అనధికారికంగా వాడుకున్న 113.57 టీఎంసీల నీటిని.. కృష్ణా నదిలో ఆ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా 299 టీఎంసీలలో భాగంగా పరిగణించాలి. ఈ మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు కేంద్రానికి లేఖ రాయాలి’ అని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును డిమాండ్‌ చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు బుధవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాల నుంచి (86.60+ 23.63) 110.23 టీఎంసీల నీటిని తెలంగాణ అనధికారికంగా విద్యుదుత్పత్తికి వాడుకుందని, అంతే నీటిని ఏపీకి కేటాయించాలని లేఖలో కోరారు. రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలు తొమ్మిదో పేరాలో పేర్కొన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రస్తావించారు. జలవిద్యుదుత్పత్తి అంశం సహా, 14వ బోర్డు భేటీలో మిగిలిపోయిన ఎజెండాపై చర్చించేందుకు తక్షణమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

లేఖలోని అంశాలివి..
* ‘కృష్ణా బోర్డు నిర్ణయాలను ఏదైనా రాష్ట్రం అమలు చేయకపోతే అందుకు ఆ రాష్ట్రమే బాధ్యత వహించాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం విధించే జరిమానా చెల్లించడంతో పాటు ఇతర పెనాల్టీలు భరించాల్సి ఉంటుంది’ అని రాష్ట్ర పునర్విభజన చట్టం 11వ షెడ్యూలు తొమ్మిదో పేరాలో ఉంది. ఆ మేరకు తెలంగాణపై చర్యలు తీసుకోవాలి.
* కృష్ణా బోర్డు 14వ సమావేశంలో చర్చించిన మేరకు.. ప్రాజెక్టుల దిగువ నీటి అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్తు ఉత్పత్తి చేయాలి తప్ప, అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదని నిర్ణయించారు. తద్విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నేటికీ శ్రీశైలంలో జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది.
* రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 3, 4ల ప్రకారం రెండు రాష్ట్రాలు అంతకుముందు కుదిరిన అన్ని ఒప్పందాలు, తీర్పులను పాటించాల్సి ఉంది. తొలి కృష్ణా ట్రైబ్యునల్‌ తుది తీర్పులోని క్లాజు 6.. ‘కేవలం విద్యుత్తు కోసమే జలవిద్యుత్తు ప్లాంట్లను నడపకూడద’ని పేర్కొంది. ఆ క్లాజులో విద్యుదుత్పత్తికి పాటించాల్సిన విధివిధానాలు నిర్దేశించారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ వీటిని కేంద్రం చేర్చింది. అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్తు ప్లాంట్లు నడుపుతోంది.
* నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 311.15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్‌ దిగువన భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీరు సరిపోతుంది. ఇప్పటికప్పుడు ఎలాంటి నీటి అవసరాలు లేవు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదలడం అంటే.. సముద్రంలోకి వదిలేయడమే. దీన్ని అరికట్టాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని