కొఠియా గ్రామాల వివాద పరిష్కారానికి సహకరించండి

ప్రధానాంశాలు

కొఠియా గ్రామాల వివాద పరిష్కారానికి సహకరించండి

వివాదాస్పద గ్రామాల్లో సాయుధ దళాలను వెనక్కి పిలవండి

ఒడిశావాసిగా మా ప్రజల ఇబ్బందులు నన్ను బాధిస్తున్నాయి

ఏపీ ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ లేఖ

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌-ఒడిశాల మధ్య తలెత్తిన సరిహద్దు గ్రామాల వివాద పరిష్కారానికి వ్యక్తిగత చొరవ చూపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మూడు పేజీల లేఖ రాశారు. ‘కోరాపుట్‌ జిల్లాలోని కొఠియా గ్రామపంచాయతీ పరిధిలోని 20కిపైగా గ్రామాలు గజపతి జిల్లాలోని ఇతర గ్రామాల్లోకి విస్తరించాయి. ఇది సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోసింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ఒకేరకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వామపక్ష తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత వివాదం కారణంగా అనిశ్చిత వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితులు విభజన శక్తులకు మేలు చేస్తాయి. అందువల్ల ఇరురాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగించడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి.

1. వివాదాస్పద గ్రామాల్లో మోహరించిన సాయుధ పోలీసు దళాలను వెనక్కి పిలవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులపై కేసులను ఉపసంహరించుకోవాలి.
2. మౌలికవసతులు, విద్య, వైద్యం మినహా మిగిలిన అన్ని నిర్మాణాలు, భూమి తవ్వకం పనులు నిలిపేయాలి.
3. సమస్య పరిష్కారానికి అవసరమైన మార్గసూచి రూపకల్పనకు ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి.
4. ఇరురాష్ట్రాల సీఎస్‌లు, అభివృద్ధి కమిషనర్ల స్థాయిలో సంయుక్త కార్యబృందం స్థాయి చర్చలు మొదలుపెట్టాలి.

కోరాపుట్‌, గజపతి జిల్లాల ప్రజలు బాధపడటం ఒడిశా వాసిగా నన్ను బాధిస్తోంది. అందువల్ల కేంద్రం తరఫున, వ్యక్తిగతంగా నేను చొరవ తీసుకొని ఇరురాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక చర్చల నిర్వహణ, వివాద పరిష్కారం కోసం సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రిగా మీరు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని