మన జనమే మన బలం

ప్రధానాంశాలు

మన జనమే మన బలం

ప్రవాస భారతీయులపై మోదీ ప్రశంసల జల్లు  
ఏ దేశంలో ఉన్నా విశిష్టతను చాటుకుంటున్నారని కితాబు
అమెరికా చేరుకున్న ప్రధానికి ఎన్నారైల ఘన స్వాగతం
దిగ్గజ కంపెనీల సీఈవోలతో పీఎం వరుస భేటీలు

వాషింగ్టన్‌: భారత సంతతి ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అద్భుత ప్రతిభా పాటవాలతో తమ విశిష్టతను, విలక్షణతను చాటుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్‌లోని ఆండ్రూస్‌ జాయింట్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన విడిది చేసిన హోటల్‌ వద్దకూ గణనీయ సంఖ్యలో ఎన్నారైలు తరలివచ్చారు. ఈ రెండు చోట్లా వారితో ప్రధాని మోదీ కొద్ది సమయంపాటు ముచ్చటించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు కూడా విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు. భారీ వర్షం కురిసిన వాతావరణ పరిస్థితుల్లోనూ విశేష సంఖ్యలో వచ్చి ఆత్మీయ స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు చెబుతూ మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘వాషింగ్టన్‌ డీసీలో ఉన్న భారత సంతతి ప్రజలను చూసి ఎంతో గర్విస్తున్నా. మన ప్రజలే మన బలం. ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రతిచోటా మన వారు తమ విశిష్టతను చాటుకోవడం అభినందనీయం’’ అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు రావడం ఇది ఏడోసారి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ప్రసంగిస్తారు.

భారత్‌లో పెట్టుబడులపై కంపెనీల అధినేతలతో చర్చలు

మోదీ అమెరికా పర్యటన తొలి రోజే అయిదు కీలక రంగాలకు చెందిన కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. వీరిలో ఇద్దరు.. అడోబ్‌ కంపెనీ ఈసీవో శంతను నారాయణ్‌, జనరల్‌ అటామిక్స్‌ సీఈవో వివేక్‌ లాల్‌ భారతీయ అమెరికన్లు కావడం గమనార్హం. మిగిలిన ముగ్గురు సీఈవోలలో క్రిస్టియానో ఇ ఎమాన్‌(క్వాల్కమ్‌), మార్క్‌ విద్మర్‌ (ఫస్ట్‌ సోలార్‌), స్టీఫెన్‌ ఎ ష్వార్జమెన్‌ (బ్లాక్‌స్టోన్‌) ఉన్నారు. ఐటీ, డిజిటల్‌ రంగాల్లో అడోబ్‌ కంపెనీ కీలకమైనది కాగా అత్యాధునిక సైనిక డ్రోన్ల తయారీలో జనరల్‌ అటామిక్స్‌ దిగ్గజ సంస్థ. 5జీ సాంకేతిక పరిశోధనల్లో అగ్రస్థానంతో పాటు వైర్‌లెస్‌ టెక్నాలజీలో మూడు దశాబ్దాలకు పైగా క్వాల్కమ్‌ కంపెనీ విశేష కృషి చేస్తోంది. సౌర విద్యుదుత్పత్తిలో ముఖ్యమైన ఫొటో వోల్టాయిక్‌ సాంకేతికతలో ప్రముఖ స్థానంలో ఫస్ట్‌ సోలార్‌ ఉంది. పెట్టుబడుల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థాయి కంపెనీ బ్లాక్‌ స్టోన్‌. భారత్‌లో ఈ కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ వివరించగా...ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనలు-అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పేందుకు సీఈవోలు సుముఖత వ్యక్తం చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. క్వాడ్‌ దేశాల్లో భాగస్వామి అయిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని