దారి తప్పిన అప్పు

ప్రధానాంశాలు

దారి తప్పిన అప్పు

రుణ ఒప్పందాలకు విరుద్ధంగా నిధుల ఖర్చు
సర్దుబాటు చేయక..  పడకేసిన ప్రాజెక్టులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి సేకరిస్తున్న నిధుల్లో రూ.వందల కోట్లు పక్కదోవ పడుతున్నాయి. రుణసేకరణ సమయంలో చెప్పే కారణం ఒకటైతే.. ఆ నిధులను వెచ్చిస్తున్న లక్ష్యం మరోటి కావడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో రుణలక్ష్యం మేరకే పనులు చేసినా బిల్లులు చెల్లించడం లేదు. రుణం తీసుకురావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అత్యవసరాలకు వాడుకోవడం, ఆనక ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయలేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టుల పేరు చెప్పి తెచ్చిన అప్పులు ఇతర అవసరాలకు మళ్లించడంతో.. లక్షిత ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. నాబార్డు, ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సౌకర్యాల అభివృద్ధి బ్యాంకు, జైకా, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థల  నుంచి అప్పులు తీసుకునే సమయంలో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులకు కూడా ‘ఫలానా పని కోసం’   అంటూ ప్రత్యేకంగా నిర్దేశిస్తారు. అందుకు విరుద్ధంగా ఖర్చు చేయడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నాబార్డు రుణాలిస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల, పల్నాడు కరవు నివారణ పథకాలకు నాబార్డు సౌజన్యం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోలవరానికి కేంద్రమే నిధులిస్తోంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చుచేసి బిల్లులు పంపితే.. వాటిని పరిశీలించాక కేంద్రం తిరిగి చెల్లిస్తోంది. ఏపీ గ్రామీణ రోడ్లు, గ్రామీణ విద్యుత్తు సరఫరా పథకం, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌, ఏపీ కరవు నివారణ పథకం తదితరాలకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రుణాలు అందిస్తున్నాయి. ఈ నిధులను తొలుత రెవెన్యూ, సంక్షేమ అవసరాలకు మళ్లిస్తున్నారు. తర్వాతైనా.. లక్షిత ప్రాజెక్టులకు సర్దుబాటు చేయగలిగితే ముందడుగు పడేవి. ఆర్థిక ఒత్తిళ్ల నడుమ అదీ సాధ్యం కావడం లేదు.

ఇవీ దృష్టాంతాలు..

*విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. రుణదాతతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పురోగతి లేదు. ఇందులో దాదాపు రూ.220 కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించినట్లు సమాచారం.

* రాష్ట్ర గ్రామీణ రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులో ఏకంగా రూ.340 కోట్లు ఇతర అవసరాలకు వినియోగించారు. రోడ్లు వేసిన గుత్తేదారులు రుణదాతలకు ఫిర్యాదు చేయడంతో ఇటీవల బిల్లుల చెల్లింపు మొదలైంది.

* ఏపీ సమగ్ర నీటిపారుదల వ్యవసాయ మార్పిడి పథకంలో చేపట్టిన సాగునీటి పనులకు అంతర్జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. దీనిలోనూ 150 కోట్ల వరకు దారిమళ్లాయి.

* 2017లో ప్రారంభించిన ఏపీ కరవు నివారణ పథకానికి ఐఫాడ్‌ నుంచి సేకరించిన రూ.70 కోట్లు ఇతరాలకు మళ్లించారు. ఇప్పుడా పనులకు సర్దుబాటు చేయాలి.

* సాగునీటి ప్రాజెక్టులకు తెచ్చిన నాబార్డు రుణం కొంత పక్కదారి పట్టింది. ఈ అనుభవాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎస్క్రో ఖాతా తెరిచి నిధులను లక్ష్యం మేరకే వెచ్చించాలని నిర్ణయించినా.. ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని