సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలను పాటించాలి

ప్రధానాంశాలు

సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలను పాటించాలి

తెదేపా నేతలపై కేసు విషయంలో పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: తెదేపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతోపాటు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో నిబంధనల మేరకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం పిటిషనర్లకు ముందుగా నోటీసునిచ్చి వివరణ తీసుకోవాలని తాడేపల్లి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులనిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటివైపు వెళ్లిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఎమ్మెల్యే జోగి రమేశ్‌ కారు డ్రైవర్‌ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు 11 మంది తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కారణాలతో తమపై తప్పుడు కేసు పెట్టారని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తనపై ప్రత్యేకంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని తెదేపా నేత నాదెళ్ల బ్రహ్మయ్య మరో వ్యాజ్యం వేశారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనలను పాటించాలని పోలీసులను ఆదేశించారు.
 


ఐఏఎస్‌లకు హైకోర్టులో ఊరట

కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్‌లకు సింగిల్‌జడ్జి విధించిన శిక్ష అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపివేసింది. ప్రతివాదులకు నోటీసులనిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎర్రగుంట (సరస్వతీనగర్‌)కు చెందిన తాళ్లపాక సావిత్రమ్మనుంచి తీసుకున్న మూడెకరాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు సింగిల్‌జడ్జి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరికి జైలుశిక్ష, జరిమానా, మరికొందరికి కేవలం జరిమానా విధించారు. ఆ తీర్పును సవాలు చేస్తూ విశ్రాంత ఐఏఎస్‌ మన్మోహన్‌సింగ్‌, నెల్లూరు జిల్లా పూర్వ కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు, పూర్వ కలెక్టర్‌ ఎవీ శేషగిబాబు, నెల్లూరు జిల్లా ప్రస్తుత కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. 


నాపై కేసు కొట్టేయండి
హైకోర్టును ఆశ్రయించిన టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎండీ

ఫైబర్‌నెట్‌ తొలిదశ టెండర్ల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని టెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఎండీ తుమ్మల గోపీచంద్‌ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈ వ్యాజ్యంపై విచారించి సీఐడీకి నోటీసులనిచ్చారు. కౌంటర్‌ వేయాలని ఆదేశిస్తూ విచారణను 4వారాలకు వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌పై తప్పుడు కేసు పెట్టారని, టెండరు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వివరించారు. పిటిషనర్‌ ఇప్పటికే ముందస్తు బెయిలు కోసం వ్యాజ్యం వేశారని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాజ్యంలో తాము కౌంటర్‌ వేసేందుకు 4వారాల సమయం కావాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.


పలువురు జిల్లా జడ్జిల బదిలీ

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ, ఐదు జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ మరికొందరికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లెలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వై.వి.యస్‌.బి.జి.పార్థసారథికి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉద్యోగోన్నతి కల్పించారు. అక్కడ పనిచేస్తున్న ఎ.వి.రవీంద్రబాబును గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. కడపలో అదనపు జిల్లా జడ్జిగా ఉన్న బి.సాయి కల్యాణ చక్రవర్తిని పదోన్నతిపై విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పంపారు. అక్కడ పనిచేస్తున్న జి.గోపీని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, అక్కడ పనిచేస్తున్న జి.రామకృష్ణను కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. వీరితోపాటు కొందరు అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ, మరికొందరు సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు అదనపు జిల్లా జడ్జిలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని