హెరాయిన్‌ వ్యవహారంలో అసత్య ప్రచారం సరికాదు

ప్రధానాంశాలు

హెరాయిన్‌ వ్యవహారంలో అసత్య ప్రచారం సరికాదు

విజయవాడ చిరునామా మినహా కేసుతో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఈనాడు, అమరావతి: ‘గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ మొత్తంలో పట్టుబడ్డ హెరాయిన్‌.. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని సంస్థదేనని, దీనికి ముఖ్యమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు’ అంటూ కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఖండిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా, అభద్రత భావం కలిగించేలా చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలని పేర్కొన్నారు. వాస్తవాల్ని వక్రీకరిస్తూ పదేపదే ప్రకటనలు చేయటం సమంజసం కాదన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ విజయవాడ చిరునామాతో ఉంది. అంతకుమించి ఈ కేసుతో రాష్ట్రానికి ఏ సంబంధమూ లేదు. ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తులు కొన్నేళ్లుగా చెన్నైలోనే ఉంటూ అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు’ అని అన్నారు. రాజకీయ నాయకులు సున్నిత విషయాలపై మాట్లాడేటప్పుడు నిజానిజాల్ని నిర్ధారించుకోవాలని డీజీపీ అన్నారు. ‘విజయవాడకు లేదా రాష్ట్రంలోని మరే ప్రాంతానికీ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఏ ఆధారాలూ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డీఆర్‌ఐకి అడిగిన మేరకు సమాచారం ఇస్తున్నాం. ఇది దేశ భద్రత అంశాలతో ముడిపడిన కేసు. మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు’ అని డీజీపీ వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని