పథకం ప్రకారమే కొప్పర్రు దాడి

ప్రధానాంశాలు

పథకం ప్రకారమే కొప్పర్రు దాడి

 బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది
డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: గణేశ్‌ విగ్రహ ఊరేగింపు పేరిట గుంటూరు జిల్లా కొప్పర్రులో వైకాపా గూండాలు పథకం ప్రకారం తెదేపా సానుభూతిపరులపై దాడి చేసిన తీరు.. రాష్ట్రంలో శాంతిభద్రతల పతనాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘చల్లడానికి కారంపొడి, తగలబెట్టడానికి పెట్రోలు సీసాలు తీసుకెళ్లడం, విద్యుత్తు మెయిన్‌ బోర్డును ధ్వంసం చేయడం తదితర చర్యలు కుట్రకు వ్యూహరచన చేసినట్లు సూచిస్తున్నాయి’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు గురువారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ‘గుంటూరు జిల్లా కొప్పర్రులో సెప్టెంబరు 20న రాత్రి 10.30కు వినాయక విగ్రహ ఊరేగింపు పేరుతో పెద్దశబ్దాలు, డ్యాన్సులు, డప్పుల మధ్య.. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు శారద ఇంటిపై వైకాపా గూండాలు దాడిచేశారు. పోలీసులకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అన్నారు. కొప్పర్రు బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు కోరారు. ‘వైకాపా గూండాల వద్ద ఫిర్యాదు తీసుకుని పెదనందిపాడు పోలీస్‌స్టేషన్‌లో తెదేపా సానుభూతిపరులపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. కొప్పర్రులో లేనివారు, గ్రామం వెలుపల నివసించేవారితో కలిపి మొత్తం 49 మందిని చేర్చారు’ అని వివరించారు.

ఉపాధిహామీ పనులకు వడ్డీతో అందేలా చూస్తాం

జాతీయ ఉపాధిహామీ పథకం(నరేగా) కింద పనులు చేసిన ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు వడ్డీ సహా ఆఖరు రూపాయి అందేవరకూ ఫిర్యాదుల విభాగం కృషిచేస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉపాధి హామీ బకాయిల బాధితుల ఫిర్యాదుల విభాగాన్ని గురువారం ఆయన తెదేపా కార్యాలయంలో ప్రారంభించారు. ‘ప్రభుత్వం కుట్రపూరితంగా ఉపాధిహామీ బిల్లులు నిలిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా నరేగా బిల్లులపై ఫిర్యాదులు ఉంటే.. మా దృష్టికి తెచ్చేందుకు ఫిర్యాదుల విభాగం తోడ్పడతుంది’ అని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. ఉపాధి హామీ సమస్యలపై సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు: 9393540999, 9676088463, 9440990479

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని