ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

ప్రధానాంశాలు

ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

బంగాళాఖాతంలో బలపడనున్న వాయుగుండం
కళింగపట్నం సమీపంలో 26న తీరం దాటే అవకాశం

ఈనాడు, విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు ప్రమాదం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముంది. ఈ తుపానుకు పాకిస్థాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. శుక్రవారం రాత్రి వాతావరణ విభాగం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం... బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి శుక్రవారం వాయుగుండంగా మారింది. సాయంత్రం 5.30 గంటలకు తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. గోపాలపుర్‌కు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో, కళింగపట్నానికి తూర్పుగా 740 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. శనివారం ఉదయానికి తుపానుగా మారొచ్చు.
* శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.
*26న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవ్వొచ్చు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలుంటాయి.
* 27న మాత్రం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది.
* ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట గంటకు 45 కి.మీ నుంచి 90 కి.మీ మధ్య గాలులు వీయవచ్చు. 27వ తేదీవరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని