విశాఖ ప్రజలు విశ్వసించడం లేదు

ప్రధానాంశాలు

విశాఖ ప్రజలు విశ్వసించడం లేదు

రాజధాని ప్రకటనలపై చంద్రబాబు వ్యాఖ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ రాజధాని అంటూ ప్రభుత్వం చెబుతున్న మాయమాటలను అక్కడి ప్రజలు విశ్వసించట్లేదని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నగర కార్పొరేటర్లు, ఇతర నేతలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ‘నగరపాలక సంస్థ ఎన్నికల్లో విశాఖ ప్రజల తీర్పు.. వారు వైకాపా పక్షాన లేరని స్పష్టం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ నగరంలో 4ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నాం. పార్టీ ఆవిర్భావం నుంచి విశాఖ తెదేపాకు కంచుకోటగా ఉంది. విశాఖ ప్రజల నమ్మకానికి అనుగుణంగా ఆ నగరానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అండగా నిలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే నగర అభివృద్ధి మరో దశకు చేరేది. తెదేపా చేసిన అభివృద్ధినంతా వైకాపా నాశనం చేసింది. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు. ‘నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలపై పోరాడాలి. పార్టీ తరఫున విప్‌ జారీ చేయాలి. ధిక్కరించిన వారిని సస్పెండ్‌ చేయాలి’ అని సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. 

కాకినాడలో తెదేపా కార్పొరేటర్లకు విప్‌: కాకినాడ కార్పొరేషన్‌లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తెదేపా కార్పొరేటర్లందరికీ పార్టీ విప్‌ జారీ చేస్తుందని, ధిక్కరిస్తే అనర్హత వేటు పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మేయర్‌ మహిళ అని చూడకుండా సుంకర పావనిని వైకాపా నేతలు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మేయర్‌ సుంకర పావని దంపతులు మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఇతర అంశాలను పావని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మేయర్‌ నివాసం వద్ద కెమెరాలు ఉంచడం, పార్టీ నేతలు కూడా కలవకుండా అడ్డంకులు సృష్టించడంవంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు.
తెలుగు మహిళ రాష్ట్ర కమిటీలోకి 16 మంది: తెలుగు మహిళ రాష్ట్ర కమిటీలోకి కొత్తగా 16 మంది చేరారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని కమిటీలోకి తీసుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని