ఏడాది అప్పు... 4 నెలల్లో ఉఫ్‌

ప్రధానాంశాలు

ఏడాది అప్పు... 4 నెలల్లో ఉఫ్‌

 4 నెలల ఖర్చు రూ. 77,204 కోట్లు

రాబడి నుంచి 53%.. అప్పు నుంచి 47%

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అవసరాలు తీర్చేందుకు ఏడాది మొత్తానికి అంచనా వేసిన అప్పు అంతా తొలి నాలుగు నెలల్లోనే వాడేసింది. శాసనసభకు సమర్పించిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.37,029.79 కోట్ల అప్పులు, ఇతర రుణ బాధ్యతల రూపంలో సమీకరించాలని లెక్కించింది. ఆ అప్పు మొత్తమూ కలిపి ఈ ఏడాది ఖర్చుకు అవసరమైన నిధుల సమీకరణ ప్రణాళికలో పేర్కొంది. అలాంటిది జులై నెలాఖరుకే, అంటే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.36,171.61 కోట్లు (97.68%) అప్పులు, ఇతర రుణ రూపాల్లో సమీకరించి ఖర్చు చేసేసింది. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ జులై వరకు రాష్ట్రప్రభుత్వ ఖర్చులను పరిశీలించి శుక్రవారం వెల్లడించిన లెక్కల సారాంశమిది. ఈ అప్పులో బహిరంగ మార్కెట్‌ నుంచి సమీకరించింది రూ.16,372.58 కోట్లు. మిగిలిన రూ.19,822.91 కోట్లు ఇతర ప్రజా పద్దు రూపంలో రాష్ట్రానికి అందిన మొత్తాన్ని ఖర్చుల కోసం వినియోగించుకున్నట్లు కాగ్‌ లెక్కలు పేర్కొంటున్నాయి. ప్రజా ఖాతాలు అంటే పీడీ ఖాతాల్లో ఉన్న నిధులు, పీఎఫ్‌ మొత్తాలు, ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తాలు, డిపాజిట్లు రిజర్వు నిధులు వంటివి ఇందులో ఉంటాయి.

రాబడి 53%, అప్పు 47%

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో అన్ని రంగాలకూ కలిపి రూ.77,124 కోట్లు ఖర్చుచేసింది. దీనికితోడు 79.99 కోట్లు అప్పులు, వడ్డీల చెల్లింపులకు వినియోగించింది. ఈ మొత్తమూ కలిపితే నాలుగు నెలల మొత్తం ఖర్చు రూ.77,204.03 కోట్లుగా తేలుతోంది. ఇంత ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వానికి ఏ రూపంలో అందాయని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వానికి రాబడి కేవలం 53.13 శాతమే. ఏకంగా 46.87 శాతం అప్పు రూపంలోనే తీసుకుని ఖర్చుచేయాల్సి వచ్చింది. మిగిలిన మొత్తం గతంలో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు తిరిగి వసూలు చేసుకోవడం వల్ల సమకూర్చుకుంది. అంటే దాదాపు కొద్దితేడాతో ప్రభుత్వానికి రాబడి, అప్పు దాదాపు సమంగా ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని