ఉద్దానం ఉసూరుమంటోంది!

ప్రధానాంశాలు

ఉద్దానం ఉసూరుమంటోంది!

పలాసలో నత్తనడకన కిడ్నీ ఆసుపత్రి నిర్మాణం

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఉద్దానంగా పిలిచే ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో సుమారు 10వేల మందికి పైగా మూత్రపిండాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో వ్యాధి తీవ్రతకు కారణాలు అన్వేషించడంతో పాటు రోగులకు స్థానికంగానే చికిత్స అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2019 సెప్టెంబర్‌లో ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 2 బ్లాకులుగా 5 అంతస్తుల్లో భవనాలు నిర్మించాల్సి ఉంది. 2021 మే నాటికి వీటిని అందుబాటులోకి తేవాల్సి ఉంది. ఆ గడువు తీరినా ఇంతవరకు మొదటి అంతస్తు కూడా నిర్మించలేదు. సకాలంలో బిల్లులు రాకపోవడం, కరోనా కారణంగా గుత్తేదారు తొమ్మిది నెలల పాటు పనులు ఆపేశారు. తర్వాత ప్రభుత్వ ఒత్తిడితో ఇటీవల పునఃప్రారంభించినా.. వేగం లేదు. మొత్తం వ్యయ అంచనా రూ.50 కోట్లు కాగా, నిర్మాణాలకు రూ.39.02 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు మిగిలిన మొత్తాన్ని వెచ్చించనున్నారు. నిర్మాణ వ్యయంలో ఇప్పటికి రూ.4.5 కోట్ల విలువైన పనులు జరిగాయి. రెండేళ్లలో చేసిన ఖర్చు 11.5% మాత్రమే. మరోపక్క, రోగులు డయాలసిస్‌ కోసం వ్యయప్రయాసలకోర్చి విశాఖ, శ్రీకాకుళం వెళ్తున్నారు. దీనిపై ‘ఈనాడు’ ఏపీఎంఎస్‌ఐడీసీ శ్రీకాకుళం ఈఈ బి.నారాయణప్రసాద్‌ను వివరణ కోరగా.. కొవిడ్‌ కారణంగా నిర్మాణంలో జాప్యమైందని, 2022 జూన్‌ నాటికి ప్రభుత్వం గడువు పొడిగించిందని చెప్పారు. ఇటీవల పనుల్లో వేగం పెరిగిందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని