టీకాల తయారీకి భారత్‌కు రండి

ప్రధానాంశాలు

టీకాల తయారీకి భారత్‌కు రండి

ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి మా దేశం
సమ్మిళితంగా, సార్వత్రికంగా అభివృద్ధి ఫలాలు
పెంచి పోషించిన వారికీ ఉగ్రవాదంతో ముప్పే
ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం

ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను భారత్‌ అభివృద్ధి చేసింది. పన్నెండేళ్లు పైబడిన వారందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చు. మరో ఎంఆర్‌ఎన్‌ఏ టీకా అభివృద్ధి తుది దశలో ఉంది. ముక్కు ద్వారా ఇవ్వగలిగే టీకాను సైతం భారత శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. కొవిన్‌ పోర్టల్‌ కోట్ల మందికి సహాయకారిగా ఉంటోంది.

ఐరాస: ‘సేవా పరమో ధర్మః అనే సూత్రంపై భారత్‌ నడుస్తుంది. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే సొంతంగా కరోనాకు టీకాలను తయారు చేసింది. మానవాళి పట్ల బాధ్యతతో ప్రపంచంలో అవసరమైనవారికి టీకాల ఎగుమతిని మళ్లీ ప్రారంభించాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్త టీకా తయారీదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. భారత్‌కు రండి... మా వద్ద వ్యాక్సిన్లను తయారు చేయండి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌కు చేరుకున్న మోదీ.. ఐరాస 76వ సర్వ ప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించారు. భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని, ఒకనాటి టీ విక్రేతనైన తాను దేశానికి ప్రధానిని కాగలగడమే దానికి ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటి దేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తుండడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ‘రైల్వే స్టేషన్‌ టీ స్టాల్‌లో విక్రయాలు జరపడంలో ఒకనాడు తండ్రికి సహకరించిన నేను ఈరోజు భారత ప్రధానిగా ఐరాసను ఉద్దేశించి నాలుగోసారి ప్రసంగిస్తున్నాను. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కలిపి నేను 20 ఏళ్లు సేవ చేసినట్లవుతుంది. అంత్యోదయ (ఎవరినీ విస్మరించకుండా ఉండటం) అనే సూత్రంతో భారత్‌ మున్ముందుకు సాగుతోంది. సమ్మిళితంగా, సార్వత్రికంగా, అందరికీ ఫలాలు పంచేదిగా అభివృద్ధి ఉండాలి’ అని చెప్పారు.

అఫ్గాన్‌ను ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలి

అఫ్గాన్‌ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడటం చాలా అవసరమని మోదీ చెప్పారు. ‘ప్రస్తుత సమయంలో అఫ్గానిస్థాన్‌ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి మహిళలు, చిన్నారులు, మైనారిటీలకు సహాయం కావాలి. మనం మన బాధ్యతను నెరవేర్చాలి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు అఫ్గానిస్థాన్‌ భూభాగాన్ని స్వార్థపూరితంగా ఏ ఒక్క దేశం ఉపయోగించుకోకుండా చూడటం చాలా ముఖ్యం’ అన్నారు. ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ సాధనంగా వాడుకుంటున్నవారు అది తమకూ పెనుముప్పు అనే విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిబంధనల ఆధారిత ప్రపంచం కోసం అంతర్జాతీయ సమాజం అంతా ఒకే గొంతుక వినిపించాలన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి మహా సముద్రాలు జీవన రేఖ వంటివనీ, విస్తరణవాదం బారిన పడకుండా వాటిని పరిరక్షించుకోవాలని చెప్పారు.

భారత్‌కు తిరుగు ప్రయాణం

అమెరికా పర్యటన ముగించుకుని మోదీ భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ద్రైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు ఫలప్రదమయ్యాయని, రాబోయే ఏళ్లలో భారత్‌-అమెరికా బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ట్వీట్‌ చేశారు. మోదీ పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.


భారత్‌ అభివృద్ధితో ప్రపంచానికి ముడి

‘‘భారత ప్రజాస్వామ్యానికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావొస్తోంది. భిన్నత్వమే భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు. డజన్ల కొద్దీ భాషలు, వందలాది యాసలు, విభిన్న జీవనశైలి, అనేకానేక రుచులు.. ఇవన్నీ భారత్‌ ప్రత్యేకం. భారత్‌ అభివృద్ధితో ప్రపంచ అభివృద్ధి ముడిపడి ఉంది. భారత్‌లో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం రూపాంతరం చెందుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉందని కరోనా మహమ్మారి మనకు నేర్పించింది. అందుకే గ్లోబల్‌ వాల్యూ చైన్‌ విస్తరణ జరగడం ముఖ్యం. ఈ దార్శనికత ఆధారంగానే ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రూపొందింది’’ అని వివరించారు.


ఐరాస ప్రభావాన్ని, విశ్వసనీయతను పెంచాలి

‘ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఐరాస అనుకుంటే.. తన విశ్వసనీయత, సమర్థతను మెరుగుపర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధపాలన ఉండాలంటే.. ఐరాసను నిరంతరం బలోపేతం చేయాలి. ప్రపంచ ప్రయోజనాలను, విలువల్ని పరిరక్షించేలా ఐరాస తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐరాస సమర్థతను, విశ్వసనీయతలను పెంచాలి. తగిన సమయంలో సరైన చర్య తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాతావరణ సంక్షోభం, కొవిడ్‌-19 బెడద వంటి సందర్భాల్లో ఐరాసపై అనేక ప్రశ్నలు ఉదయించాయి. కరోనా వైరస్‌ మూలాలు కనిపెట్టడం, సులభతర వాణిజ్య ర్యాంకులు వంటి విషయాల్లో ప్రపంచ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది’ అని మోదీ చెప్పారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని