సర్కారు వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ ఇక కష్టం!

ప్రధానాంశాలు

సర్కారు వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ ఇక కష్టం!

నిబంధనలు పక్కాగా అమలుకు వైద్యారోగ్యశాఖ చర్యలు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును అడ్డుకొనేందుకు.. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రైవేటు ప్రాక్టీసు వల్ల కొందరు వైద్యులు ప్రభుత్వాసుపత్రుల్లో నిర్ణీత వేళల్లో ఉండడంలేదని, అతిథులుగా వచ్చి వెళ్తున్నారన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం, పరీక్షల కోసం ‘తెలిసిన’ వారు నిర్వహించే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని కూడా సూచిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి పదేళ్ల కిందట కొలువులు పొందిన సీనియర్‌ వైద్యులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ తర్వాత వివిధ నోటిఫికేషన్ల ద్వారా విధుల్లో చేరిన వైద్యులకు మాత్రం ప్రైవేటు ప్రాక్టీస్‌ చేయకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అయితే వీటి పూర్తిస్థాయి అమలుకు ప్రభుత్వాలు, వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకోకపోవడంతో సమస్య కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ నిషేధంపై చర్చలు సాగుతున్నాయి. నిబంధనలు పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నిషేధంపై ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో ప్రస్తుతం వైద్యులకు చెల్లిస్తున్న వేతనాలు, అందుతున్న ఆర్థిక ప్రయోజనాలపైనా చర్చ జరుగుతోంది. ఇలా ప్రాక్టీసు చేయడంపై  వైద్య ఆరోగ్య శాఖలోనే పలు రకాల జీవోలు ఉన్నాయి. వీటినీ అధికారులు పరిశీలిస్తున్నారు.

* 2019లో విశ్రాంత ఐ.ఎ.ఎస్‌. సుజాతారావు నేతృత్వంలోని సంస్కరణల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించి.. వారు ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సొంత ప్రాక్టీసు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఈ నివేదిక అనుసరించి వైద్యారోగ్య శాఖ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. వాటి ఫలితాలనూ అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.

బయోమెట్రిక్‌ అమలుకు యోచన!

వైద్యులు, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్‌ ద్వారా హాజరు గుర్తించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. చాలామంది సమయపాలన పాటించకపోతుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సరైన సమయంలో వారికి చికిత్స అందడంలేదు. ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు నమోదుకు సమాలోచనలు జరుగుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని