ఈ-నామ్‌ అమలులో సమస్యలు

ప్రధానాంశాలు

ఈ-నామ్‌ అమలులో సమస్యలు

కర్నూలు మార్కెట్‌లో పది రోజులుగా ఆగిన ఉల్లి విక్రయాలు
పెట్టుబడులు రాక అన్నదాతల విలవిల

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: కర్నూలు మార్కెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-నామ్‌ విధానం అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. ఒకే దేశం- ఒకే మార్కెట్‌ నినాదంతో 2016 నుంచి ఈ-నామ్‌ విధానంతో దేశంలోని పలు విపణుల్లో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 17న ఉల్లిని ఈ-నామ్‌ విధానం కిందకు తీసుకొచ్చి కొనుగోలు చేసేందుకు కర్నూలు మార్కెట్‌ అధికారులు అడుగులు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా అపోహలతో కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు దీనిని వ్యతిరేకించడంతో విపణిలో పది రోజులుగా ఉల్లి కొనుగోళ్లు ఆగిపోయాయి.

పెట్టుబడి కూడా రాక..

రాష్ట్రంలోనే ఉల్లి మార్కెట్‌కు కర్నూలు పెట్టింది పేరు. ఈ ఏడాది జిల్లాలో 15,500 హెక్టార్లలో ఉల్లి సాగైంది. పెరిగిన ధరలు, కూలీ ఖర్చులతో కలిపి ఎకరానికి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడిగా పెట్టారు. తెగుళ్లు, వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా ఎకరానికి గరిష్ఠంగా 50 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. అయితే కర్నూలు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తమిళనాడులోని కోయంబేడు, హైదరాబాద్‌ మార్కెట్లకు ఉల్లి తరలించారు. హైదరాబాద్‌లో క్వింటాకి రూ.250-600, కోయంబేడులో రూ.800 వరకు ధర పలికింది. రవాణా ఛార్జీలు, అక్కడి ఏజెంట్లకు కమీషన్లు చెల్లించగా రైతులకు ఏమీ మిగలడం లేదు. పలు ప్రాంతాల్లో ఉల్లి కోత కోసినా కొనేందుకు ఎవరూ రాకపోవడంతో సరకు పాడైపోతోంది.

అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా..

మార్కెట్‌కు సరకు తీసుకురమ్మంటూ కమీషన్‌ ఏజెంట్లు ముందుగా రైతులకు రవాణా ఖర్చులిస్తున్నారు. తీరా మార్కెట్‌కు వచ్చాక ఈ-నామ్‌ విధానంలో సరకు టెండర్‌ కావడం లేదని చెబుతున్నారు. అలాగే లాట్‌కు పోటీదారులు కూడా తక్కువగా ఉంటున్నారు. చివరికి తెచ్చిన సరకు వెనక్కి తీసుకు వెళ్లలేక వచ్చిన కాడికి ఏదో ఒక వ్యాపారికి రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇక ట్రేడర్లకు వచ్చేసరికి బహిరంగ వేలంలో ఎంత అవసరమైతే అంతే కొనుగోలు చేసుకోవచ్చు. అదే ఆన్‌లైన్‌ టెండర్లలో కావాల్సిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేయాల్సి వస్తుందన్న భావన ఏజెంట్లలో ఉంది. దీంతో ఏజెంట్లు, వ్యాపారులు ‘ఈ-నామ్‌’ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అవి పరిష్కరించడంలో జాప్యం జరుగుతుండటంతో ఉల్లి కొనుగోళ్లు ఆగిపోయాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని