నేడు భారత్‌ బంద్‌

ప్రధానాంశాలు

నేడు భారత్‌ బంద్‌

రాష్ట్ర ప్రభుత్వ మద్దతు
పాఠశాలల మూసివేత..
ఒంటిగంట వరకు బస్సులు బంద్‌
వైకాపా సంఘీభావం
ప్రత్యక్షంగా పాల్గొననున్న తెదేపా, వామపక్షాలు, కాంగ్రెస్‌

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌మోర్చా తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సోమవారం నిర్వహించే బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులను నిలిపేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. మధ్యాహ్నం తర్వాత యథావిధిగా బస్సులు తిరుగుతాయని వెల్లడించింది. పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కొన్ని జిల్లాల్లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాలను వాయిదా వేశారు. బంద్‌కు వైకాపా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మిషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. తమ పార్టీ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సీపీఎం, సీపీఐ సహా అన్ని వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ బంద్‌లో పాల్గొననున్నాయి.

రైతు సమస్యలపైకేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధం: రైతు సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని వ్యవసాయ మిషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రైతులు, రైతు సంఘాల నాయకుల మనోభావాలను గౌరవించి గతంలో రెండుసార్లు చేపట్టిన బంద్‌కు మద్దతిచ్చాం. కేంద్రం వద్ద రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్లన్నీ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్నాయి. రైతు భరోసా, మద్దతు ధర కల్పన, ఉచిత విద్యుత్‌, ఇన్‌పుట్‌ రాయితీ సహా అన్ని రకాల సాయం చేస్తోంది. గడిచిన రెండున్నరేళ్లలో అద్భుతాలు చేశామని మేం చెప్పడం లేదు. ఇంకా ఎక్కడైనా లోటుపాట్లుంటే చెబితే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే జెండా వేరే పెట్టుకుని చంద్రబాబు ఎజెండాతో జగన్‌ను విమర్శించడం సరికాదు. రైతు సమస్యలను పరిష్కారానికి కేంద్రంతో మాట్లాడేందుకు సిద్ధం. పార్లమెంటులో లెవనెత్తేందుకు వైకాపా ఎంపీలు ఒక అడుగు ముందే ఉంటారు’ అని పేర్కొన్నారు.


దిల్లీలో బందోబస్తు ముమ్మరం

దిల్లీ: 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన భారత్‌ బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ, వామపక్షాలు, బీఎస్పీ తెలిపాయి. ఇప్పటివరకు 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్‌కు ఎస్‌కేఎం ఏర్పాట్లు చేసింది. బంద్‌ పిలుపు నేపథ్యంలో దిల్లీలో పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. నిరసన శిబిరాల నుంచి ఎవరూ దేశ రాజధానిలోకి రాకుండా చర్యలు చేపట్టారు. దిల్లీలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకు బంద్‌ పాటిస్తామని, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఎస్‌కేఎం తెలిపింది.


పదేళ్లపాటైనా పోరాడతాం: టికాయిత్‌

10 నెలలుగా ఉద్యమిస్తున్న తాము అవసరమైతే పదేళ్లపాటు దాన్ని కొనసాగించడానికి సిద్ధమేగానీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు కానిచ్చేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టం చేశారు. డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. ట్రాక్టర్లను సిద్ధం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని