గడ్డాలు, విభూతి తిరగబడ్డాయ్‌!

ప్రధానాంశాలు

గడ్డాలు, విభూతి తిరగబడ్డాయ్‌!

వేలూరు కోటలో తెలుగు సిపాయిల వేట

ది తమిళనాడులోని వేలూరు కోట. 1806 జులై 9వ తేదీ రాత్రి కోలాహలంగా గానా బజానా జరిగింది. ఆటపాటలతో ఆహ్లాదం పొందిన కోటలోని సిపాయిలు తెలతెలవారుతుండగా తుపాకులు పట్టి తిరుగుబాటు చేశారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన 200 మంది తెల్లవాళ్లను హతమార్చారు. కోటపై టిప్పు సుల్తాన్‌ పులి పతాకను ఎగురవేసి, అక్కడే బందీగా ఉన్న టిప్పు కుమారుడు ఫతే హైదర్‌ను తమ రాజుగా ప్రకటించారు. హైదర్‌ తల్లి రోషనీ బేగం ఆంధ్రప్రదేేశ్‌లోని ఆదోనికి చెందిన నర్తకి. టిప్పు సుల్తాన్‌ యువరాజుగా ఉన్న రోజుల్లోనే రోషనీ బేగం మైసూరుకు చేరి రాజదర్బారులో నాట్యం చేసేవారు. టిప్పుకీ ఆమెకు కలిగిన సంతానమే ఫతే హైదర్‌. 1799లో ఈస్టిండియా కంపెనీ సైన్యం శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పును హతమార్చి, ఆయన అంతఃపురంలోని 550 మంది మహిళలను 1802లో తమిళనాడులోని వేలూరు కోటకు తరలించింది. వారికి టిప్పు భార్యగా రోషనీ బేగం పెద్దరికం వహించేవారు. రానురానూ వేలూరు కోటలో రాజకుటుంబీకుల సంఖ్య 790కి పెరిగింది. వీరికి రాజ భరణాల కింద చెల్లింపులు మరీ ఎక్కువైపోయాయని తలచిన నాటి మద్రాసు గవర్నర్‌ విలియం బెంటింక్‌ ఆ చెల్లింపులకు కోతవేశారు. ఇది సహజంగానే రోషనీని బాధపెట్టింది.

మరోవైపు కోటలోని భారతీయ సిపాయిలు నుదుట విభూతి పెట్టుకోరాదనీ, గడ్డాలు పెంచకూడదనీ ఈస్టిండియా కంపెనీ ఉత్తర్వులు జారీ చేసింది. తలపాగాలూ ధరించకూడదనీ, వాటి బదులు తెల్లవాళ్లు ధరించే టోపీ వంటిది పెట్టుకోవాలన్నది. అంతటితో ఆగకుండా శిలువ లాంటి వస్తువును మెడలో ధరించాలని నిర్బంధపెట్టింది. ఇదంతా తమను క్రైస్తవ మతంలోకి మార్పించడానికే చేస్తున్నారని హిందూ, ముస్లిం సిపాయిలు ఆగ్రహించారు. టిప్పు రాజ్యం పతనమైన తరవాత ఆదరణ కరవైన ఫకీర్లు కూడా ఈస్టిండియా కంపెనీపై తిరగబడవలసిందిగా సిపాయిలను రెచ్చగొట్టసాగారు. తెల్లవాళ్లు, క్రైస్తవులు ధరించే టోపీలను పెట్టుకోవలసిందిగా సిపాయిలను బలవంతం చేయడం వారి మతాన్ని మార్పించడానికేనని వేలూరు వీధుల్లో ఫకీర్లు ప్రచారం చేయసాగారు. దాంతో టోపీలు ధరించడానికి సిపాయిలు, వారి నాయకులు నిరాకరించారు. దీనికి ప్రతిగా ఈస్టిండియా అధికారులు ఒక హిందూ, ఒక ముస్లిం హవల్దారును 900 కొరడా దెబ్బలు కొట్టి శిక్షించారు. ఇది వేలూరు కోటలో తిరుగుబాటు వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా తయారైంది.

ఈ సందట్లోనే ఈస్టిండియా కంపెనీ తమను మతమార్పిడికి ప్రేరేపిస్తోందన్న వదంతులు సిపాయిల మధ్య కార్చిచ్చులా వ్యాపించాయి. వేలూరు కోటలోని సిపాయిలలో తెలుగువారే ఎక్కువ. మలబారీ ముస్లింలూ గణనీయ సంఖ్యలో ఉండేవారు. మత మార్పిడి వదంతులతోపాటు తెల్లవాళ్లు తమను లోకువగా చూస్తున్నారనే ఆగ్రహమూ కలగలసి సిపాయిలు తిరగబడ్డారు. కోట కమాండర్‌ కర్నల్‌ జాన్‌ ఫాన్‌ కోర్ట్‌ సహా 200మంది తెల్లవాళ్లను హతమార్చారు. తిరుగుబాటు వార్త వేలూరుకు సమీప ఆర్కాటులోని ఈస్టిండియా కంపెనీ దళాలకు తెలిసి, కర్నల్‌ రోలో గిలెస్పీ నాయకత్వంలో వేలూరుకు చేరుకున్నాయి. కోటలో దాదాపు 100 మంది సిపాయిలను అక్కడికక్కడే హతమార్చాయి. మరి కొన్ని వందలమంది సిపాయిలు కోట నుంచి పరారైనా, బ్రిటిష్‌ సైనికులు వారిని వేటాడి పట్టుకున్నారు. 19 మంది సిపాయి నాయకులను వేలూరు కోటలో హతమార్చారు. కొందరిని ఉరితీశారు, మరికొందరిని తుపాకులతో కాల్చి చంపారు. ఇంకొందరిని ఫిరంగి గొట్టాలకు కట్టి పేల్చేశారు. మొత్తం మీద 800 మంది సిపాయిలను ఈస్టిండియా కంపెనీ హతమార్చింది.

వేలూరు తిరుగుబాటుతో ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులు విభూతి మీద, గడ్డాల మీద ఆంక్షలు తొలగించారు. టోపీల ఆర్డరును పక్కన పెట్టారు. విలియం బెంటింక్‌ను మద్రాసు నుంచి లండన్‌కు తిప్పిపంపేశారు.

సిపాయిలకు మరణ శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఆకాశంలో రాబందులు వారిని అనుసరించాయి. ఫిరంగి గుళ్ల దెబ్బకు ఛిద్రమైన సిపాయిల మృతదేహాల నుంచి తునకలు గాల్లోకి ఎగిరినప్పుడు, అవి కిందపడకముందే రాబందులు నోటితో పట్టుకుని ఎగిరిపోయేవని బ్లాకిస్టన్‌ అనే బ్రిటిష్‌ రచయిత రాశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని