మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

ప్రధానాంశాలు

మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి

ఇక మిగిలిన వారినీ ఏరేయాలి
సీఎంల సమావేశంలో అమిత్‌ షా పిలుపు

దిల్లీ: వామపక్ష ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దిశానిర్దేశం చేశారు. ఈ అంశంలో ఆయన రెండంచెల పోరును ప్రతిపాదించారు. మావోయిస్టుల వేటను ఉద్ధృతం చేయడంతో పాటు, వారి ఆర్థిక మూలాలనూ దెబ్బతీయాలని సూచించారు. వారికి నిధులొచ్చే మార్గాలను మూసివేయాలని, ఇందుకు ఈడీ, ఎన్‌ఐఏ లాంటి కేంద్ర సంస్థల సహకారం రాష్ట్రాలు తీసుకోవాలని సూచించారు. మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్న సంఘాల విషయంలో ఉదాసీనత పనికిరాదని, వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఆదివారం దేశంలోని వామపక్ష తీవ్రవాదంపై అమిత్‌ షా.. 10 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఒడిశా, తెలంగాణ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ సీఎంలు పాల్గొన్నారు. బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు మూడు గంటలసేపు జరిగిన ఈ సమీక్షలో నక్సల్స్‌ హింసకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలపై షా సూచనలు చేశారు.

కూకటివేళ్లతో పెకలించండి

దేశంలో వామపక్ష ఉగ్రవాదంపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నక్సల్స్‌ హింస గణనీయంగా తగ్గిందన్నారు. అయితే ఇప్పటివరకు సాధించిన విజయాలతో తృప్తి చెందకుండా.. ఈ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. మిగిలిన కొద్దిమందిని కూడా ఏరివేయాలని రాష్ట్రాలకు సూచించారు. మావోయిస్టుల కారణంగా.. ఈ ఏడాది 200 హింసాత్మక ఘటనలు మాత్రమే జరిగాయి. అత్యధికంగా 2009లో 2,258 కేసులు నమోదయ్యాయి. అప్పటితో పోలిస్తే దాదాపు 70% నక్సల్స్‌ హింస తగ్గింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతూ వస్తోంది. 2010లో 96 జిల్లాల్లో నక్సల్స్‌ కార్యకలాపాలు కొనసాగితే.. ఇప్పుడు ఆ సంఖ్య 53కి పరిమితమైంది. ఈ గణాంకాలను హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది.

వచ్చే 18 నెలల్లో 2,542 మొబైల్‌ టవర్స్‌

నక్సల్స్‌ ఏరివేతలో సమాచార సేకరణ కీలకమని అమిత్‌ షా అన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో 2,542 టవర్లను వచ్చే 18 నెలల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో 3,114 పోస్టాఫీసులను తెరుస్తామని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో విద్యపై కూడా దృష్టి పెట్టామని, ఇందుకోసం మరిన్ని ఏకలవ్య పాఠశాలల తెరిచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, గిరిరాజ్‌ సింగ్‌, అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ అరవిందకుమార్‌.. ఇతర కేంద్ర, రాష్ట్ర సీనియర్‌ పోలీసు, పౌర అధికారులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని