ఉత్తరాదిన సంపూర్ణం.. దక్షిణాదిన మిశ్రమం

ప్రధానాంశాలు

ఉత్తరాదిన సంపూర్ణం.. దక్షిణాదిన మిశ్రమం

భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన
దిల్లీ, పంజాబ్‌, హరియాణాలలో స్తంభించిన రోడ్డు, రైలు రవాణా
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు
కాంగ్రెస్‌, వామపక్షాలు సహా పలు పార్టీల మద్దతు

దిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక... సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన భారత్‌ బంద్‌కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. బంద్‌ ప్రభావం దిల్లీ, పంజాబ్‌, హరియాణా, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లలో అధికంగా, రాజస్థాన్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో కొంతమేర కనిపించింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో రైతన్నలకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఆర్జేడీ, ఎస్సీ, ఆప్‌, బీఎస్పీ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ రైతులకు మద్దతు తెలిపినప్పటికీ బంద్‌కు దూరంగా ఉంది. రైతుల ఆందోళనతో దిల్లీ-గురుగ్రామ్‌ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గాజీపుర్‌, సింఘూ సరిహద్దులలో రైతులు జాతీయ రహదారులను దిగ్భందించారు.

రైతుల సత్యాగ్రహం: రాహుల్‌ గాంధీ

భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతు తెలిపారు. రైతుల శాంతియుత సత్యాగ్రహం దృఢ సంకల్పంతో కొనసాగుతోందని ట్వీట్‌ చేశారు. కొత్త సాగు చట్టాలు రద్దు చేసే వరకూ రైతుల వెన్నంటే నిలుస్తామని పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తెలిపారు.

అనూహ్య స్పందన: ఎస్‌కేఎం

బంద్‌కు దేశ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతు ఉద్యమ ప్రభావం మరిన్ని ప్రాంతాలకు విస్తరించిందని రైతు నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు.

రాష్ట్రంలో ప్రశాంతంగా బంద్‌

ఈనాడు, అమరావతి, యంత్రాంగం: భారత్‌ బంద్‌ ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్‌, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ, కాంగ్రెస్‌, ఆప్‌ తదితర పార్టీలన్నీ ఎక్కడికక్కడ ఆందోళనల్లో పాల్గొన్నాయి. వైకాపా బంద్‌కు సంఘీభావం పలికింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో తెరుచుకోలేదు. థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
* విజయవాడలో నిర్వహించిన నిరసనలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు ఎస్‌.శైలజానాథ్‌, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలోనూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
* విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు కూర్మన్నపాలెం కూడలి వద్ద ధర్నా చేపట్టారు. మద్దెలపాలెం వద్ద వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. శ్రీకాకుళంలోనూ నాయకులు ఆందోళనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరంలోనూ నిరసనలు కొనసాగాయి.
* తిరుపతిలో దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌లోనికి ప్రవేశించిన నాయకులు పట్టాలపై పడుకుని నినాదాలు చేశారు. కర్నూలులో తెదేపా నాయకులు ద్విచక్ర వాహనాలతో, కోడుమూరు ప్రధాన రహదారిపై వామపక్షాల నేతలు ఎద్దుల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో గడియార స్తంభం నుంచి తాడిపత్రి బస్టాండు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కడప కోటిరెడ్డి కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మైదుకూరులో నిరసనకారులు రోడ్డుపై కూరగాయలు పారబోసి నిరసన తెలిపారు.


రైతుల ఉద్యమం వెనుక రాజకీయం: సోము వీర్రాజు

వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఉద్యమం వెనుక కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోమవారం ఆయన రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘బంద్‌కు వైకాపా మద్దతు ఇవ్వడం దారుణం. వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్‌లో మద్దతిచ్చి ఇప్పుడు కమ్యూనిస్టులతో ఎందుకు కలవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌చేశారు.


చర్చలకు రండి: కేంద్ర మంత్రి తోమర్‌


అన్నదాతల అభ్యంతరాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళనను వీడి.. చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పిలుపునిచ్చారు. దీనిపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పందిస్తూ...‘చర్చలకు మరోసారి సిద్ధమని కేంద్రం చెప్తున్నా అది కేవలం టీవీలకే పరిమితమైంది. మమ్మల్ని నేరుగా ఎవరూ సంప్రదించలేద’ని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని