వైకాపా నేతలే స్మగ్లింగ్‌ కింగ్‌లు

ప్రధానాంశాలు

వైకాపా నేతలే స్మగ్లింగ్‌ కింగ్‌లు

ఎర్రచందనం కేసులున్న వ్యక్తికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు

రూ.లక్షల కోట్ల డ్రగ్స్‌ చలామణీ చిన్న విషయమా?

తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో నేతల ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ వాస్తవాలను దాచి పెడుతున్నారని పలువురు తెదేపా నేతలు మండిపడ్డారు. ఆషి ట్రేడింగ్‌ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడలో ఉందని, వారి కార్యకలాపాలు రాష్ట్రంలో ఇసుమంతైనా లేవని డీజీపీ ఎలా చెబుతారని వారు నిలదీశారు. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం సోమవారం ఆన్‌లైన్‌లో జరిగింది. ‘వైకాపా నేతలే గంజాయి, గుట్కా, ఎర్రచందనం, తలనీలాలు, బియ్యం, హెరాయిన్‌ అక్రమ రవాణా చేస్తూ రూ.వేల కోట్లను ఆర్జిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడికి ఫోరెన్సిక్‌ పరీక్షలు ఎందుకు చేయించలేదు? ఎర్రచందనం కేసులు ఉన్న విజయానందరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. బియ్యం స్మగ్లింగ్‌ చేసే వారికి పదవులిచ్చారు. గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే గుట్కా తయారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గంజాయి అమ్మించారనే ఆరోపణలున్న ఓ పోలీసు అధికారికి గుంటూరు జోన్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలి’ అని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఆషి కంపెనీ జూన్‌ వరకు తొమ్మిదిసార్లు జీఎస్టీ రిటర్నులను ఫైల్‌ చేయడం నిజం కాదా? కేంద్ర డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు రాష్ట్రాల్ని ఎందుకు అప్రమత్తం చేశారు? దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌ని డ్రగ్స్‌ మాఫియాకు అడ్డాగా మార్చేశారు. రూ.2 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్‌ను మాఫియా చలామణీ చేసింది. ఇంత పెద్ద విపత్తుని డీజీపీ చిన్నదిగా ఎలా చూపుతారు? తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతోనే ఆ ప్రకటన చేశారా?’ అని ధ్వజమెత్తారు. గులాబ్‌ తుపానుతో నష్టపోయిన రైతుల్ని, నిరాశ్రయులైన ప్రజల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం ముందుంచిన డిమాండ్‌లు ఇవీ...!

వ్యవసాయ చట్టాలపై జగన్‌ ద్వంద్వవైఖరి..!

* పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన జగన్‌రెడ్డి... ఇప్పుడు రైతు సంఘాల బంద్‌కూ మద్దతివ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
* రాయలసీమకు జగన్‌రెడ్డి చేస్తున్న ద్రోహంపై అక్టోబరు 6న హిందూపురంలో సమావేశం. 15 లక్షల ఎకరాల్లో వేరుసెనగ పంట దెబ్బతిన్నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు.
* కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేసి ఛార్జీలు పెంచారు. ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారు.

ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కేందుకే..!

* శాసనసభలో ప్రజాసమస్యలపై మాట్లాడే అచ్చెన్నాయుడు, రామానాయుడులకు మైక్‌ కట్‌ చేయాలని జగన్‌రెడ్డి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కడమే.
* విషజ్వరాల బారినపడి ప్రజలు సతమతమవుతున్నారు. తెదేపా హయాంలో ప్రతి జిల్లాలోను కొనుగోలు చేసిన ఈ-రిక్షాలు, ఈ-ఆటోలను, ఇతర యంత్ర పరికరాల్ని మూలన పడేసి రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు.
* విశాఖ మన్యంలో గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా బాక్సైట్‌ మైనింగ్‌కు అనుమతులిచ్చి, ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దోషిగా నిలబడే దుస్థితి కల్పించారు. రస్‌ అలైఖైమా వ్యవహారంలో సెటిల్మెంట్‌ కోసం లండన్‌కు ప్రత్యేకంగా అధికార బృందాన్ని పంపాల్సిన పరిస్థితికి దిగజార్చారు.
* పేదవారి రేషన్‌ కార్డులు, పింఛన్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పథకాన్ని వచ్చే నెలకు వాయిదా వేశారు.
* ప్రభుత్వం ఇంకా రూ.563 కోట్ల ఉపాధి హామీ బిల్లుల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై న్యాయపరంగా పోరాడతాం.
* ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ నేతృత్వంలో జరిగిన దండయాత్రపై కేంద్ర హోం శాఖకు తెదేపా ఎంపీలు ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ప్లాన్‌ నిధుల దారి మళ్లింపుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని