తుపానుతో ఉత్తరాంధ్రలో చీకట్లు

ప్రధానాంశాలు

తుపానుతో ఉత్తరాంధ్రలో చీకట్లు

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు  
పలు చోట్ల సరఫరా పునరుద్ధరణ

ఈనాడు, అమరావతి: గులాబ్‌ తుపాను కారణంగా విద్యుత్‌ సంస్థకు రూ 787.06. కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనే రూ.503 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని తేల్చింది. బలంగా వీచిన గాలులతో పలు చోట్ల విద్యుత్‌ తీగలు తెగడం, స్తంభాలు విరిగి పోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  విద్యుతు సరఫరా నిలిచిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, గార, సంతకవిటి, విజయనగరం జిల్లాలోని    పూసపాటిరేగ, పాచిపెంట, సాలూరు, తెర్లాం,  సీతానగరం, బలిజపేట మండలాల్లోని ప్రజలు చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం  11.26 లక్షల కనెక్షన్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా ఇందులో సోమవారం సాయంత్రానికి 10.24 లక్షల కనెక్షన్లకు పునరుద్ధరించారు. ఈ పనుల కోసం శ్రీకాకుళం జిల్లాలో 70, విజయనగరంలో 44, విశాఖలో 72, రాజమహేంద్రవరంలో 27 ప్రత్యేక బృందాలను నియమించారు.

మున్సిపాలిటీల్లోనూ..

శ్రీకాకుళంలోని 6, విజయనగరంలో 3, విశాఖ జిల్లాలో 4, తూర్పు గోదావరిలో 12, పశ్చిమగోదావరిలోని 9 మున్సిపాలిటీల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్‌ పరిధిలో 103 మండలాల్లో సరఫరాకు ఇబ్బంది ఏర్పడితే 101 మండలాల్లో మరమ్మతులు చేశారు. విద్యుత్తు నిలిచిన మొత్తం 3821 గ్రామాల్లో 3626 చోట్ల సరఫరాను పునరుద్ధరించారు. శ్రీకాకుళంలో 246, విజయనగరంలో 131, విశాఖలో 157, తూర్పుగోదావరిలో 90, పశ్చిమగోదావరిలో 50 దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 290 కొత్తవి ఏర్పాటు చేశారు.

మరమ్మతులకు గురైన సబ్‌స్టేషన్లు.. ఫీడర్లు

* శ్రీకాకుళం జిల్లాల్లో హెచ్‌టీ సబ్‌స్టేషన్‌ దెబ్బతింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 33కేవి సబ్‌స్టేషన్లు 380 దెబ్బతినగా వాటిలో 376కు మరమ్మతులు చేశారు. 33కేవి ఫీడర్లు 276 దెబ్బతింటే.. 270 బాగు చేశారు.
* 33 కేవి విద్యుత్‌ సరఫరా స్తంభాలు 107 చోట్ల విరిగితే 87 చోట్ల కొత్తవి ఏర్పాటు చేశారు.
10 కి.మీల విద్యుత్‌ తీగలను తొలగించి 7 కి.మీల మేర కొత్తవి అమర్చారు.
* శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 405 11 కేవి ఫీడర్లూ దెబ్బతినగా వాటిలో 355 ఫీడర్లను బాగుచేశారు. విశాఖలో 695 ఫీడర్లు దెబ్బతిన్నాయి. విజయనగరంలో 423 దెబ్బతింటే 315కి మరమ్మతులు పూర్తి చేశారు.
* 11కేవి విద్యుత్‌ స్తంభాలు 1120 దెబ్బతింటే.. 588 చోట్ల కొత్తవి వేశారు. దెబ్బతిన్న 1719ఎల్‌టీ స్తంభాల స్థానంలో 810 చోట్ల కొత్తవి వేశారు.
11 కేవి లైన్లు 51.19కి.మి, ఎల్‌టీ లైన్లు 66.58 కి.మీల మేర దెబ్బతిన్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని