అవినీతికి చోటు ఉండదు

ప్రధానాంశాలు

అవినీతికి చోటు ఉండదు

ఆన్‌లైన్‌ విధానాలను ప్రవేశపెట్టాలి
భూముల రక్షణకు ప్రత్యేక కమిటీ
దేవాదాయశాఖ సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు-అమరావతి: దేవాదాయశాఖలో ఆన్‌లైన్‌ విధానాలను ప్రవేశపెట్టి అవినీతికి అడ్డుకట్ట వేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ విధానాలను తెలియజేస్తూ ప్రతి ఆలయంలో పెద్ద బోర్డులు పెట్టాలని సూచించారు. తితిదే అమలుచేస్తున్న మంచి విధానాలన్నింటినీ ఇతర ఆలయాల్లోనూ అనుసరించాలన్నారు. అక్కడి విధానాలపై ఆలయాల ఈవోలకు శిక్షణనివ్వాలని సూచించారు. భక్తులకు వసతి, ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ప్రత్యేకించి ప్రసాదాలు భక్తులకు గుర్తుండిపోయేలా ఉండాలని సూచించారు. తిరుమలలోని లడ్డూ తయారీ విధానాలను ఇతరచోట్ల అనుసరించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం దేవాదాయశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌ విధానంతో దేవాదాయశాఖలో మార్పు తేవాలి. దీని ద్వారానే విరాళాలు స్వీకరించొచ్చు. వాటిని ఆలయాల అభివృద్ధికి వినియోగించాలి. దేవాలయ కమిటీలను వెంటనే నియమించాలి. తద్వారా పర్యవేక్షణ పెరుగుతుంది. శ్రీశైలం సహా దేవాలయాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి. ఆడిటింగ్‌ నిర్వహించాలి. ఆన్‌లైన్‌ బుకింగ్‌, కియోస్క్‌ల ఏర్పాటు, క్యూఆర్‌కోడ్‌తో చెల్లింపులు తదితర డిజిటల్‌ విధానాలను ప్రవేశపెట్టాలి. దేవాలయాలకున్న భూములను సర్వే చేసి జియోట్యాగింగ్‌ చేయాలి. భూముల రక్షణకు కలెక్టర్‌, ఎస్పీ, ప్రభుత్వ న్యాయవాదితో జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ఆలోచించాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18వేల ఆలయాల్లో భద్రతకు 47వేల సీసీ కెమెరాలు పెట్టాం. విజిలెన్సు, సెక్యూరిటీ కోసం ఈ శాఖలో ఎస్పీ స్థాయి అధికారిని నియమించాలి. దేవాలయాల భద్రతపై పోలీసుల పర్యవేక్షణ ఉండాలి’ అని సీఎం సూచించారు. దేవాలయాల్లో పనిచేసే 1,305 మంది అర్చకులకు వేతనం కనీసం 25శాతం పెంచుతామని హామీనిస్తే, ఆచరణలో 56నుంచి 100శాతం వరకు పెంచామని అధికారులు తెలిపారు. అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించటంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సీసీఎల్‌ఏ ప్రసాద్‌, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి (దేవాదాయం) వాణీమోహన్‌, ఆలయ ఈవోలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని