ఈ నెల అప్పు రూ. 5వేల కోట్లు

ప్రధానాంశాలు

ఈ నెల అప్పు రూ. 5వేల కోట్లు

4 నెలలకు రూ.10,500 కోట్లకు అనుమతి
ఒక్క నెలలోనే సగం సమీకరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం బహిరంగ మార్కెట్‌ రుణం కోసం రిజర్వుబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. ఈ నెల 28న నిర్వహించే బహిరంగ సెక్యూరిటీల వేలంలో రూ.500 కోట్ల చొప్పున  రూ.వెయ్యి కోట్లు సమీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. 17 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చే ఒప్పందం ప్రాతిపదికన రూ.500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో మరో రూ.500 కోట్లు రుణం కావాలంటూ ప్రతిపాదించింది. ఏ వడ్డీ ధరకు ఈ మొత్తం స్వీకరిస్తుందనేది మంగళవారం వేలం పూర్తయిన తర్వాత తేలుతుంది. ఈ మొత్తాన్ని కలిపి ఒక్క సెప్టెంబరు నెలలోనే ఆంధ్రప్రదేశ్‌ రూ.5,000 కోట్లు ఒక్క బహిరంగ మార్కెట్‌ నుంచే రుణం పొందినట్లవుతుంది. దీంతో ఇంతవరకు బహిరంగ మార్కెట్‌ నుంచి సమీకరించిన రుణ మొత్తం రూ.25,751 కోట్లకు చేరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి రూ.10,500 కోట్లు రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్‌ మొదటి వారంలో అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రిజర్వుబ్యాంకుకు సైతం వర్తమానం పంపింది. డిసెంబర్‌ నెలాఖరు వరకు అంటే ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల వరకు ఈ మొత్తం రుణంగా పొందేందుకు రెండో విడత అనుమతి లభించింది. అలాంటిది ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే రూ.5,000 కోట్లు రుణం తీసుకోవడంతో నాలుగు నెలల రుణ అవకాశంలో సగం మొత్తాన్ని ఒక్క నెలలోనే సమీకరించినట్లవుతుంది. కేంద్రం విధించిన తొలి పరిమితి మేరకు ఆగస్టు నెలలోనే రూ.20,750 కోట్లు రుణం తీసేసుకున్నారు. ఈ రుణ పరిమితి పెంచాలని ఎప్పటి నుంచో ఏపీ ఆర్థికశాఖ అధికారులు కేంద్రానికి విన్నవిస్తున్నా.. పెంపు నిర్ణయం రాకపోవడం వల్ల ఆగస్టు నెలలో చాలినంత మేరకు రుణాలు తీసుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.42,472 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. పదిహేనో ఆర్థిక సంఘం సూచనల మేరకు ఈ మొత్తం నిర్ణయించారు. ఆ తర్వాత గతంలో పరిమితికి మించి వాడుకున్న అప్పును మినహాయించి ఈ మొత్తాన్ని రూ.27,688 కోట్లకు తగ్గించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని