సహకార రంగాన్ని ధ్వంసం చేశారు

ప్రధానాంశాలు

సహకార రంగాన్ని ధ్వంసం చేశారు

డెయిరీలనూ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారు  
అమూల్‌ వచ్చాకే వారు పాల ధరల్ని పెంచారు
జగనన్న పాల వెల్లువ, మత్స్యశాఖలపై సీఎం సమీక్ష

ఈనాడు, అమరావతి: ‘గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించుకున్నారు. వాటిని కొందరు ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారు. వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. హెరిటేజ్‌కి మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారు’ అని ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపించారు. అమూల్‌ ప్రవేశించిన తరువాత రాష్ట్రంలోని డెయిరీలు తప్పని పరిస్థితుల్లోనే ధరలు పెంచాయని గుర్తుచేశారు. లీటర్‌కి అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోందని గుర్తుచేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సీఎం జగన్‌ సమీక్షించారు.
మహిళలు ఆదాయం పెంచుకోవడానికి పాడి పశువులు కొనుగోలు చేశారని, వారికి మరింత చేయూత ఇవ్వడానికి బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని ఆదేశించారు. కిందటేడాది నవంబరులో అమూల్‌ ద్వారా 71,373 లీటర్ల పాలు కొనుగోలు చేస్తే ఈఏడాది ఆగస్టులో 14,46,979 లీటర్లు కొన్నట్లు అధికారులు తెలిపారు. జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం-కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ శిక్షణ కరదీపిక పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు.

మత్స్య ప్రాసెసింగ్‌, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వ ప్రవేశం: ‘మత్స్య రంగంలో ఉత్పత్తి చేతికొచ్చే నాటికి ప్రాసెసింగ్‌, ఎగుమతులు చేసే వారు కుమ్మక్కు అవుతూ ధరలు తగ్గిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ప్రీ ప్రాసెసింగ్‌, ప్రాసెసింగ్‌, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. మత్స్యశాఖపై సమీక్ష సందర్బంగా సీఎం మాట్లాడుతూ... ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించడానికి ఆక్వా హబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలు ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్తులో ఆక్వాహబ్‌లలో చిన్న రెస్టారెంట్లు పెట్టే ఆలోచన చేయాలన్నారు. ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం విడుదల చేశారు. జనవరి 26 నాటికి 80 హబ్‌లు, 14వేల రిటైల్‌ దుకాణాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో మంత్రి అప్పలరాజు, ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, కరికాల వలవన్‌, సత్యనారాయణ, కన్నబాబు, ఎం.డి.బాబు,  అమూల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. తన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించిన నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌లో కొనియాడారు. జాషువా జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని