విశాఖను వెంటాడుతున్న ముంపు

ప్రధానాంశాలు

విశాఖను వెంటాడుతున్న ముంపు

ఓ మాదిరి వానకే లోతట్టు ప్రాంతాల మునక  
‘గులాబ్‌’ తుపానుతో అతలాకుతలం
వేల మందికి తప్పని తిప్పలు

ఈనాడు, న్యూస్‌టుడే- విశాఖపట్నం: ‘గులాబ్‌’ తుపాను ధాటికి విశాఖ నగరంలోని 88 లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వందలాది వాహనాలు నీట మునిగిపోయాయి. పెద్ద సంఖ్యలో ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. వర్షాల తీవ్రత తగ్గడం, మంగళవారం నాటికి నీరంతా సమీప గెడ్డల్లోకి చేరడంతో ప్రజలు కొంత తేరుకున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఏళ్ల తరబడి ఇదే సమస్య ఉన్నా పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచడం లేదు  విశాఖ విమానాశ్రయానికి కూతవేటు దూరంలోని హరిజన జగ్గయ్యపాలెం పరిసర కాలనీల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిందే. భారీ వర్షాల సమయంలో పరిసర ప్రాంతాల్లో నీరంతా ఇక్కడికే చేరి మూడు, నాలుగడుగుల ఎత్తున నిలిచిపోతోంది. గులాబ్‌ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు అదే పరిస్థితి తలెత్తింది.
గతంలో ఈ ప్రాంతంలోని వారిని రక్షించడానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పడవల్లో వెళ్లాల్సి వచ్చింది. స్థానిక నేతలు, అధికారుల చొరవతో కాలువ నిర్మించడంతో తీవ్రత కొంత తగ్గినా.. సమస్య పూర్తిగా పరిష్కారమవలేదు. ఇక్కడ నిలిచే నీరు దిగువకు ప్రవహించేలా కాలువలను విస్తరించాలని స్థానికులు   కోరుతున్నారు.

జాతీయ రహదారే అయినా

వెంకోజీపాలెం నుంచి హనుమంతవాక వెళ్లే మార్గంలో కొండపై నుంచి నీరు భారీగా జాతీయ రహదారికి చేరుతోంది. సుమారు మూడడుగుల ఎత్తున ప్రవహిస్తుండటంతో వందలాది వాహనాలు అతి కష్టంపై ప్రయాణిస్తున్నాయి. పలు ద్విచక్రవాహనాలు, కార్ల పొగ గొట్టాల్లోకి నీరు చేరి దారి మధ్యలో ఆగిపోతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే జాతీయ రహదారిపై ఏళ్లతరబడి ఈ సమస్య ఉన్నా పరిష్కరించకపోవడం గమనార్హం.  
* నగరంలోని రైల్వేస్టేషన్‌కు సమీపంలోని చావలమదుం వంతెన కింద నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణిస్తారు. వర్షాలు వచ్చినప్పుడు ఐదు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండడంతో కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
* మధురవాడ ప్రాంతం బక్కన్నపాలెంలో సుమారు అయిదెకరాల్లో చెరువును అభివృద్ధి చేశారు. సమీప ప్రాంతాల్లోనూ, కూతవేటు దూరంలో ఉన్న కొండలపై నుంచి వచ్చే వర్షపునీరు ఆ చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయలేదు. దీంతో చిన్నవానకే పరిసర కాలనీలు జలమయమవుతున్నాయి.  


ఇళ్లలోకి వరద పోటెత్తుతోంది
- నూకరత్నం, హరిజన జగ్గయ్యపాలెం

హరిజన జగ్గయ్యపాలెంలో సోమవారం తెల్లవారుజామున వరద నీరు ఇంట్లోకి రావడంతో కట్టుబట్టలతో బయటపడ్డాం. మధ్యాహ్నానికి వరద కొంత తగ్గుముఖం పట్టడంతో తిరిగివచ్చాం. అప్పటికే టీవీ, ఇతర సామగ్రి, నిత్యావసర సరకులు పూర్తిగా తడిసిపోయాయి. ఈ ప్రాంతంలోని కొన్ని కాలువలను వెడల్పు చేస్తే నీళ్లు కిందికి వెళ్లిపోతాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని