క్యాన్సర్‌ చికిత్సలకు చేయూతనందిస్తా

ప్రధానాంశాలు

క్యాన్సర్‌ చికిత్సలకు చేయూతనందిస్తా

నోరి దత్తాత్రేయుడి వెల్లడి
ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం
ప్రభుత్వ సలహాదారుగా ఉండాలని కోరిన సీఎం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ చికిత్సలను సామాన్యులకు చేరువ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు. క్యాన్సర్‌ వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అధునాతన చికిత్స అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తమ ఇద్దరి ప్రణాళికలు ఒకేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. ప్రజారోగ్యం, క్యాన్సర్‌ చికిత్స, అత్యాధునిక విధానాలపై చర్చించారు. అనంతరం దత్తాత్రేయుడు విలేకరులతో మాట్లాడారు. ‘‘నేనిక్కడే మంటాడ (పమిడిముక్కల మండలం)లో పుట్టాను. బెజవాడలో తిరిగాను. కర్నూలు వైద్య కళాశాలలో చదువుకున్నా. క్యాన్సర్‌ చికిత్స కోసం రాష్ట్రం నుంచి రోగులు వేరే నగరాలకు వెళ్లాల్సి వస్తుండడం బాధాకరం. ఆర్థికంగా భారం లేకుండా గ్రామాల్లో ఉండేవారికీ క్యాన్సర్‌ చికిత్స అందుబాటులోకి రావాలన్నది నా కోరిక. దీనిపై సీఎం జగన్‌తో సుదీర్ఘంగా చర్చించా. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఆధునిక క్యాన్సర్‌ ఆసుపత్రుల ఏర్పాటుకు సీఎం సంసిద్ధత వ్యక్తంచేశారు. జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో ఈ చికిత్సలను అందుబాటులోకి తెచ్చి.. 3 ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పెద్దాసుపత్రులకు అనుసంధానం చేయాలి. ఈ మూడింట్లోనూ ఒక దానిని సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలి. ఈ విషయంలో నా వంతు చేయూత అందించేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎంకు చెప్పా. ఆయన కూడా సంతోషం వ్యక్తంచేశారు. ఈరోజు ఈ విషయంలో ఓ గొప్ప ముందడుగు పడింది. ఆరోగ్య రంగంలో సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తుండడం స్వాగతించాల్సిన విషయం’’ అని పేర్కొన్నారు.
*  క్యాన్సర్‌ చికిత్సల విషయంలో ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని నోరి దత్తాత్రేయుడిని సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని