high court cj:హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ప్రమాణం

ప్రధానాంశాలు

high court cj:హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ప్రమాణం

చేయించిన గవర్నరు బిశ్వభూషణ్‌
హాజరైన సీఎం జగన్‌, న్యాయమూర్తులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. ఆయన చేత ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను సీజేగా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌ భానుమతి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కుటుంబసభ్యులు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి బంధువులు, సన్నిహితులు, న్యాయవాదులు తరలి వచ్చారు. కార్యక్రమం పూర్తయ్యాక గవర్నర్‌, సీఎం.. సీజేను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మూడో ప్రధాన న్యాయమూర్తి.

నేపథ్యమిదే...

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించారు. బిలాస్‌పుర్‌లోని గురుఘసిదాస్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గఢ్‌ జిల్లా కోర్టుతో పాటు, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. ఆ రాష్ట్రానికి బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా సేవలు అందించారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా సేవలు అందించారు. 2007 సెప్టెంబరు 1 నుంచి అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు.


నేడు తిరుమలకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గురువారం తిరుమలకు రానున్నారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ హిమాకోహ్లి వస్తున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని