మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

ప్రధానాంశాలు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత

దీర్ఘకాలంగా అనారోగ్యం
మరణాన్ని ధ్రువీకరించిన  పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (60) అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం మరణించారు. మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్‌తోనూ బాధపడుతున్నట్లు సమాచారం. ఆర్కే మరణాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జరిపిన చర్చలకు  ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 2004 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో చర్చలు జరిగాయి. సరిగ్గా 17 ఏళ్లు అవుతున్న తరుణంలో ఆర్కే చనిపోయారు. సాకేత్‌, శ్రీనివాసరావు, ఎస్వీ, సంతోష్‌, గోపాల్‌, పంతులు ఆయన మారు పేర్లు.

చర్చల ప్రతినిధి
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన శాంతి చర్చల ప్రస్తావన రాగానే ఆర్కే గుర్తొస్తారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్‌కు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. ఉత్తర తెలంగాణ తరఫున గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌, ఏవోబీ నుంచి సుధాకర్‌, ఆంధ్ర రాష్ట్ర కమిటీ వైపు రామకృష్ణ, జనశక్తి నుంచి రియాజ్‌ హాజరయ్యారు.

ఆది నుంచి ఉద్యమబాటే
గుంటూరు జిల్లా మాచర్లలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కార్యకలాపాలో చురుగ్గా పాల్గొనేవాడు. అప్పుడే ఆయనకు పీపుల్స్‌వార్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1983లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లి ఎక్కువగా నల్లమల అడవుల్లోనే పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీ కార్యదర్శిగా 1996 నుంచి 2006 వరకు ఉన్నారు. 2008 నుంచి 2016 వరకూ ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కేంద్రకమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. అప్పటికే మావోయిస్టు ఉద్యమంపై పోలీసులది పైచేయి కావడం, ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ముఖ్యనాయకులను ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌కు రమ్మని ఆదేశించింది. దాదాపు పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంటున్న ఆయన కొంతకాలం సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆర్కేపై పదుల సంఖ్యలో కేసులున్నాయి. ఇందులో ప్రధానమైంది చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన ఘటన. బలిమెలలో గ్రేహౌండ్స్‌ బలగాలపై జరిగిన దాడిలోనూ ఆర్కే నిందితుడు. ఆయనపై ఒడిశా ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.40 లక్షలు, ఝార్ఖండ్‌ రూ.12 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం
ఉద్యమంలో ఉండగానే కందుల నిర్మల అలియాస్‌ శిరీష అలియాస్‌ శారద అలియాస్‌ పద్మతో పరిచయం ఏర్పడింది. ఆమెనే పెళ్లి చేసుకున్నారు. శిరీష కూడా డివిజన్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

ఉద్యమంలోనూ ఉపాధ్యాయుడే
స్వతహాగా ఉపాధ్యాయుడైన ఆర్కే ఉద్యమంలోనూ అదే పంథా కొనసాగించారు. ఉద్యమంలోకి వచ్చేవారికి శిక్షణ తరగతులు నిర్వహించేవారు. 20 ఏళ్లపాటు నల్లమలలో పనిచేసి అక్కడి యువత ఉద్యమంపట్ల ఆకర్షితులు కావడంలో కీలకపాత్ర పోషించారు.

చుట్టుముట్టిన గ్రేహౌండ్స్‌ బలగాలు
శాంతి చర్చలు ముగిసిన 15 రోజులకే ఆర్కేను గ్రేహౌండ్స్‌ బలగాలు చుట్టుముట్టాయి. చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో ఆర్కే ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టాయి. విషయం తెలియగానే విరసం నేత వరవరరావు, ప్రజాసంఘాల నేతలు అప్పటి హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. అయితే ఆర్కేని పోలీసు బలగాలు చుట్టుముట్టినట్లు పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.

తృటిలో తప్పించుకొని
2016 అక్టోబరు 23న ఒడిశాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు.ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల సమావేశంపై గ్రేహౌండ్స్‌ దళాలు విరుచుకుపడ్డాయి. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తోటి మావోయిస్టుల సాయంతో ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసులు కాల్పులు జరుపుతుండగానే సహచరులు ఆర్కేని తప్పించారు. ఆయనకు బుల్లెట్‌ గాయం అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఎన్‌కౌంటర్లో ఆయన కుమారుడు పృథ్వీ అలియాస్‌ శివాజీ అలియాస్‌ మున్నా చనిపోయాడు. తల్లి శిరీషతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న మున్నా తండ్రిని కలిసి వస్తానని చెప్పి 2010లో ఒడిశా వెళ్లి ఉద్యమంలో చేరాడు. అంతకు ముందు కూడా ఆర్కే అనేకసార్లు పోలీసుల కాల్పుల నుంచి బయటపడ్డారు.


టీవీల్లో చూసి తెలుసుకున్నాం
విలేకర్లతో ఆర్కే తోడల్లుడు కల్యాణ్‌రావు

ఒంగోలు నేరవిభాగం, టంగుటూరు, న్యూస్‌టుడే: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతికి సంబంధించి ఆ పార్టీ నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేదని, టీవీల్లో ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ చేసిన ప్రకటన చూసి తెలుసుకున్నామని ఆయన తోడల్లుడు, విరసం నాయకుడు జి.కల్యాణ్‌రావు తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆయన విలేకర్లతో గురువారం మాట్లాడారు. ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఆర్కే మృతివార్తతో ఆలకూరపాడులోని ఆయన భార్య శిరీష ఇంటివద్ద విషాదం నెలకొంది. మీడియాతో మాట్లాడేందుకు వారు ఆసక్తి చూపలేదు. కొద్దిసేపటి తర్వాత కల్యాణ్‌రావు వచ్చి మాట్లాడారు. శిరీష మూడు నెలల క్రితం ఆర్కేను కలిసి వచ్చినట్లు సమాచారం.

ఎస్పీ మహేష్‌చంద్ర లడ్హాపై దాడి
2005 ఏప్రిల్‌ 27న ఒంగోలు రంగారాయుడు చెరువు సమీపంలో ఫ్యాన్సీగూడ్స్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ మూల మలుపులో అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ మహేష్‌చంద్రలడ్హాపై మావోయిస్టులు దాడిచేశారు. ఒక సైకిల్‌పై క్లెమోర్‌మైన్‌ అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ సందర్భంలో ఎస్పీ లడ్హా, ఆయన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ముగ్గురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఆర్కేనే సూత్రధారి అని పోలీసులు కేసు నమోదుచేశారు.


కుటుంబమంటే ఎంతో ఇష్టం
అన్నతో అనుబంధాన్ని ‘ఈనాడు’తో పంచుకున్న రాధేశ్యాం

ఈనాడు, హైదరాబాద్‌: తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవుల బాటపట్టిన తొలినాళ్లలో వారిని చూడటానికి రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఉంటున్న ఆయన, ఆర్కే చనిపోయారన్న విషయం తెలిసి, గురువారం ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు. మరో సోదరుడు సుబ్బారావుతో కలిసి అన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘ మా కుటుంబం 1980 దశకంలో హైదరాబాద్‌కు వచ్చింది. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, సచ్చిదానందరావు. వీరికి ఆరుగురు సంతానం. అయిదుగురు మగపిల్లలు కాగా ఒక కుమార్తె. ఆర్కే పెద్దవాడు. తండ్రి కూడా ఆర్‌ఎస్‌యూ భావజాలం కలిగి ఉండేవారు. ఆయన రాజేంద్రనగర్‌లోని స్ప్రింగ్‌ఫీల్డ్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఆర్కే కూడా అదే పాఠశాలలో 1980 నుంచి 1981 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత పీపుల్స్‌వార్‌లో చేరి అడవుల బాటపట్టారు. 1981-90 మధ్య తల్లిదండ్రులను చూసేందుకు పోలీసుల కళ్లుగప్పి మూడు సార్లు రాజేంద్రనగర్‌కు వచ్చారు. రోజంతా కుటుంబసభ్యులతో గడిపి రెండు పూటలా భోజనం చేసి వెళ్లారు. అయితే 1990 తరువాత ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు.  

అనుమతిస్తే అంత్యక్రియలకు సిద్ధం
ప్రస్తుతం ఇద్దరు సోదరులు నైజీరియాలో ఉండగా మరో సోదరుడు సుబ్బారావు, నేను రాజేంద్రనగర్‌లో ఉంటున్నాం. సోదరి ఎల్బీనగర్‌లో ఉంటోంది. తండ్రి సచ్చిదానందరావు 2003లో, తల్లి రాజ్యలక్ష్మి 2013లో చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు ఆర్కే వస్తాడేమోనన్న సమాచారంతో రాజేంద్రనగర్‌లో పోలీసులు కాపు కాశారు. ప్రస్తుతం తెరాస స్థానిక నాయకుడిగా కొనసాగుతున్నా. ఆర్కే చనిపోయిన విషయం అధికారికంగా గురువారం రాత్రి వరకు తెలియదు. వదినకు ఫోన్‌ చేద్దామంటే నంబరు లేదు. ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాధేశ్యాం వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని