సోమవరంలో నల్ల బంగారం

ప్రధానాంశాలు

సోమవరంలో నల్ల బంగారం

బొగ్గు బ్లాక్‌ల వేలం జాబితాలో కృష్ణా జిల్లాకు స్థానం

చాట్రాయి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామ పరిధిలోని వెస్ట్‌ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌ల వేలం జాబితాలో చేర్చింది. బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన తాజా జాబితాలో సోమవరానికి చోటు దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తడికలపూడి ప్రాంతాలతో పాటు సోమవరంలోనూ బొగ్గు నిక్షేపాలున్నాయని సింగరేణి సుమారు పదిహేనేళ్ల కిందట చేపట్టిన సర్వేలో వెల్లడైంది. నిక్షేపాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత లోతున ఉన్నాయి తెలుసుకునేందుకు ఎంఈసీఎల్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో దాదాపు ఏడాదిన్నరకు పైగా ఇక్కడ యంత్రాల సహాయంతో బొగ్గు అవశేషాలను వెలికితీసి, శాస్త్రీయ పరిశీలనకు పంపారు. సుమారు 50 ఏళ్లకు సరిపడా నిక్షేపాలున్నట్లు గుర్తించారు. ఓపెన్‌ కాస్ట్‌ కాకుండా భూగర్భ గనిలో నుంచే బొగ్గు వెలికితీస్తారనే ప్రచారం కూడా సాగింది. తెలంగాణలోని సత్తుపల్లిలో ఓపెన్‌ కాస్ట్‌ ప్రారంభ సమయంలోనే ఇక్కడ కూడా పనులు మొదలుపెడతారని భావించారు. అప్పట్లో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు నూతన రైల్వే లైను విస్తరణ కోసం సింగరేణి రైల్వే శాఖకు కొంత నగదు సైతం చెల్లించింది. ప్రస్తుతం సర్వే పూర్తి చేసి భూసేకరణ దశలో పనులున్నాయి. సత్తుపల్లి నుంచి సోమవరం వరకు సుమారు 40 కి.మీ. దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో సత్తుపల్లి వరకు తరలించి, అక్కడి నుంచి రైలులో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలని భావించారు. కాలక్రమేణా ఇక్కడ బొగ్గుపై సింగరేణి అంతగా దృష్టి సారించలేదు. రాష్ట్ర విభజనతో పూర్తిగా మరుగునపడిన ఆ వ్యవహారం కేంద్రం బొగ్గు బ్లాక్‌ల వేలంలో సోమవరం పేరు చేర్చడంతో తాజాగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పనులు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని