ప్రాజెక్టుల అప్పగింతపై  హైడ్రామా

ప్రధానాంశాలు

ప్రాజెక్టుల అప్పగింతపై  హైడ్రామా

శ్రీశైలం కింద 4 అవుట్‌లెట్లను ప్రకటించిన ఏపీ
సిబ్బంది ఇతరత్రా బదిలీకి తెలంగాణ అంగీకరించాలనే షరతు
జీవో ఇవ్వని తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులకు ప్రాజెక్టుల అప్పగింతపై హైడ్రామా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు కింద నాలుగు అవుట్‌లెట్లను(ప్రాజెక్టుల నుంచి నీరు బయటకు వెళ్లే మార్గాలను) బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణానదిపై మొత్తం 15 అవుట్‌లెట్లను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకురావాలి. అందులో 9 తెలంగాణ అప్పగించాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆరింటిని అప్పగించాలి. నాలుగింటికి సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు విద్కుత్కేంద్రాలకు సంబంధించి ఏపీ జెన్‌కో తరఫున ఇంధనశాఖ ఆదేశాలు జారీ చేయనుంది.

ఏపీ ఉత్తర్వులు జారీ చేస్తూ ఇందులో ఒక షరతు పెట్టింది. ‘‘కృష్ణా బోర్డు సమావేశంలో తీర్మానించిన ప్రకారం తెలంగాణ... అక్కడ ప్రాజెక్టులను, అవుట్‌లెట్లను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఆ ప్రక్రియ చేపడితేనే ఆంధ్రప్రదేశ్‌ అధికారులూ ముందుకెళ్లాలి. తెలంగాణతో పాటు ప్రక్రియ సమాంతరంగా సాగాలి. ఇందుకు సంబంధించి తెలంగాణ జలవనరులశాఖ, జెన్‌కోలతో ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ, ఏపీ జెన్‌ కో సమన్వయం చేసుకోవాలి’’ అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పాలన), కర్నూలు చీఫ్‌ ఇంజినీరు, అనంతపురం చీఫ్‌ ఇంజినీర్లకు ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్‌ 14వ తేదీ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించిన తుది సమావేశాల్లో తీర్మానం చేసిన ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఉత్తర్వులు (జీవో) విడుదల కావాల్సి ఉన్నా  రెండు రాష్ట్రాలు ఆచితూచి అడుగులేస్తున్నాయి.

కేడబ్ల్యూడీటీ-2 వైపే తెలంగాణ చూపు
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి వరకు ఏ నిర్ణయం వెల్లడించలేదు. మొదటి నుంచీ జల విద్యుత్‌ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సమ్మతించడం లేదు. కృష్ణా జలాల్లో వాటా పెంపుతోపాటు, కొన్ని ప్రాజెక్టుల కింద నీటి కేటాయింపులు, తదితర అంశాలపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2) ద్వారా పరిష్కారానికి రాష్ట్రం ప్రయత్నిస్తోందని బోర్డు దృష్టికి కూడా తెచ్చింది. నదీ జలాల కోసం చేస్తున్న న్యాయపోరాటం ముగియకముందే మధ్యలోనే ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం సమంజసం కాదంటూ కొందరు నిపుణులు తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మరోవైపు గెజిట్‌ వాయిదా వేస్తే మేలని, లేని పక్షంలో బోర్డు ప్రతిపాదించిన వాటిల్లో జల విద్యుత్‌ కేంద్రాలు మినహాయించి మిగిలినవి అప్పగించేందుకు పరిశీలన చేయొచ్చంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ సీఈ, నల్గొండ సీఈ పరిధిలోని అవుట్‌లెట్లను ఆయన లేఖలో ప్రస్తావించారు.
శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టును బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్‌ తన ఉత్తర్వుల్లో కోరింది.

బోర్డుకు బదిలీ చేసిన అవుట్‌లెట్లు, పోస్టులు ఇతర వివరాలు  
*శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే- నది స్లూయీస్‌: సర్కిల్‌ కార్యాలయం పరిధిలో 39 పోస్టులు, నిర్వహణ డివిజన్‌, ఐదు ఉప డివిజన్ల కింద 142 పోస్టులు ఉన్నాయి.
* పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (శ్రీశైలం కుడి ప్రధాన కాల్వ): తెలుగు గంగ డిస్ట్రిబ్యూటరీ డివిజన్‌తోపాటు ఒక సబ్‌ డివిజన్‌, నాలుగు సెక్షన్లు కలిపి మొత్తం 37 పోస్టులు.
* హంద్రీనీవా ఎత్తిపోతల పంపుహౌస్‌: గడివేముల సబ్‌ డివిజన్‌, మల్యాల సెక్షన్లు ఉన్నాయి.
* ముచ్చుమర్రి ఎత్తిపోతల పంపుహౌస్‌: రెండు సెక్షన్లు ఉన్నాయి.
* హంద్రీనీవా, ముచ్చుమర్రి కలిపి 8 పోస్టులు ఉన్నాయి.  
* ఉపసంఘం సభ్యులుగా ఉన్న అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీరు, ఏపీ జెన్‌ కో హైడల్‌ చీఫ్‌ ఇంజినీరు ప్రాజెక్టుల బదిలీ ప్రక్రియ సులువుగా జరిగేందుకు సహకరిస్తారని బోర్డు ఛైర్మన్‌కు తెలియజేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని