అడవుల్లోనే అంత్యక్రియలు

ప్రధానాంశాలు

అడవుల్లోనే అంత్యక్రియలు

ఆర్కేకు తుది వీడ్కోలు పలికిన మావోయిస్టులు

అధిగమించాల్సిన అడ్డంకులెన్నో

ఆర్కే చివరి లేఖ

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, దుమ్ముగూడెం: అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (63) మృతదేహానికి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు జరిగాయి. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు-కొండపల్లి ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్కే మృతదేహం ఫొటోల్ని మావోయిస్టులు శనివారం విడుదల చేశారు. మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మావోయిస్టులు, స్థానిక గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నట్టు మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు అభయ్‌ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ‘ఆర్కే ఆశయాలు సాధిస్తాం-మావోయిస్టు పార్టీ జిందాబాద్‌- దీర్ఘకాల ప్రజాయుద్ధం వర్ధిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున మావోయిస్టులు, ఆదివాసీలు నినాదాలు చేశారు. ఆర్కే అంత్యక్రియలకు పోలీసుల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా, అటవీ ప్రాంతాల చుట్టూ మావోయిస్టు శ్రేణులు తుపాకులతో పహరా కాశాయి. మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత (ఏఓబీ) ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆర్కే కిడ్నీ సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లో మరణించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట. 

ఆర్కే మరణం తీరని లోటు: జనశక్తి

ఆర్కే మరణం విప్లవోద్యమానికి, ప్రజాయుద్ధానికి తీవ్ర నష్టమని సీపీఐ(ఎం.ఎల్‌)జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శి విశ్వనాథ్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విప్లవ నాయకులు ఒక్కొక్కరే అనారోగ్య కారణాలతో అమరులవడం విషాదకర పరిణామమన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని