ఘాటు తగ్గిన మిర్చి

ప్రధానాంశాలు

ఘాటు తగ్గిన మిర్చి

ఎగుమతుల దెబ్బ

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

చైనాలో పాత నిల్వలు

జూన్‌తో పోలిస్తే క్వింటాలుకు రూ.2వేల తగ్గుదల

ఈనాడు, అమరావతి: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు మిరప ఎగుమతులు నిలిచాయి. ఇప్పటికే విక్రయించిన మిరపకు చెల్లింపులూ జరగడం లేదు.  చైనా కూడా గతేడాదితో పోలిస్తే దిగుమతులు తగ్గించుకుంది. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు కొనసాగుతుండడం కొంతమేర ఊరటనిస్తోంది. దీని వల్ల కొన్నాళ్లుగా ధరలు నిలకడగానే ఉన్నా.. గతంతో పోలిస్తే తగ్గుదలే కన్పిస్తోంది. 2020 దసరా సమయంలో.. క్వింటాలు రూ.19వేల వరకు పలికిన తేజ రకం మిరప.. ఇప్పుడు రూ.13వేల నుంచి రూ.14వేల మధ్యకు చేరింది. మిగిలిన రకాల ధరలూ రూ.3వేల నుంచి రూ.4వేల మేర తగ్గాయి. జూన్‌తో పోలిస్తే క్వింటాలుకు రూ.2వేల వరకు పడిపోయింది. ధరలు పెరుగుతాయనే ఆశతో శీతల    గోదాముల్లో నిల్వ చేసిన రైతులు క్వింటాలుకు రూ.3వేలకు పైగా నష్టపోయారు.

శ్రీలంక నుంచి నిలిచిన చెల్లింపులు

భారత్‌ నుంచి మిరప ఎగుమతుల్లో చైనా, థాయ్‌లాండ్‌ తర్వాత శ్రీలంక నిలుస్తుంది. గతేడాది భారత్‌ నుంచి 6.01 లక్షల టన్నుల మిరప ఎగుమతి చేయగా.. అందులో శ్రీలంకకు 50,835 టన్నులు వెళ్లాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అధికంగా సాగయ్యే 334 రకంతో పాటు సూపర్‌ 10 రకం మిరపకు శ్రీలంక నుంచి డిమాండ్‌ ఉంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కొన్నాళ్లుగా ఎగుమతులు నిలిచాయి. గతంలో అమ్మిన సరకుకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ధరల్లోనూ కొంతమేర తేడా వచ్చింది.

చైనాకు మందగించిన ఎగుమతులు

భారత్‌ నుంచి మిరప ఎగుమతుల్లో సింహభాగం చైనాకే వెళ్తాయి. గతేడాదితో పోలిస్తే అక్కడకూ ఎగుమతులు మందగించాయి. సన్నరకం మిరపను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. గతేడాది ఎగుమతి అయిన 6.1 లక్షల టన్నుల్లో 1.40 లక్షల టన్నులు ఈ దేశానికే వెళ్లాయి. నిల్వలు అధికంగా.. వినియోగం తక్కువగా ఉండటంతో చైనా ఈ ఏడాది దిగుమతులు తగ్గించుకుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే 30% నుంచి 35% పైగా తగ్గిపోయాయి. గతేడాది అక్టోబరు నాటి ధరలు వస్తాయనే ఆశతో రైతులు మిరపను శీతల గోదాముల్లో నిల్వ చేశారు. మొదటి, రెండో కోత కాయల్ని అమ్ముకున్నా.. మూడో కోతను ఇప్పటికీ విక్రయించలేదు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని శీతల గోదాముల్లో 40 లక్షల నుంచి 50 లక్షల బస్తాల వరకు ఉంటాయని అంచనా. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌లోనూ 25 లక్షల బస్తాల వరకు ఉండొచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇందులో 20% వరకు రైతులకు చెందిన మిరప ఉంటుంది. కొందరు జనవరిలో.. మరికొందరు మార్చిలో శీతల గోదాములకు తరలించారు. వీటికి అయ్యే ఖర్చులు, తెచ్చిన రుణాలపై వడ్డీ కలిపితే క్వింటాలుకు రూ.వెయ్యి వరకు అవుతున్నాయి. ధరల తగ్గుదల రూపంలో క్వింటాలుకు రూ.2వేల వరకు తేడా ఉంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని