అధిగమించాల్సిన అడ్డంకులెన్నో

ప్రధానాంశాలు

అధిగమించాల్సిన అడ్డంకులెన్నో

ఆర్కే చివరి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యమం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారానే విజయాలు సాధించడం సాధ్యమని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇన్ఛార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ తన చివరి లేఖలో స్పష్టం చేశారు. డిసెంబరు 2 నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) ద్విశతాబ్ది వార్షికోత్సవాలు జరుపుకొంటున్న సందర్భంగా ఆయన సాకేత్‌ పేరుతో రాసిన చివరి లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యమ ఆశయం, ప్రస్తుత గడ్డు పరిస్థితులు, చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి.. ‘ బుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన ఈ దేశంలో ప్రజలపై వారి ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి హింసాత్మక మార్గం చేపట్టరని, ఇక్కడ సాయుధ పోరాటానికి ఆస్కారం ఉండదని భావించేవారు. 1970 అక్టోబరు 27వ తేదీన బిహార్‌లోని మాగుర్జాన్‌ రైతాంగ దళం పోలీసులపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ సిద్ధాంతం పటాపంచలైంది. తర్వాత ఏర్పడ్డ పీఎల్జీఏకు ఇదే పునాది. గత 20 ఏళ్లుగా అణచివేతలను దృఢంగా ఎదుర్కొంటూ, రోజురోజుకూ పురోగమిస్తోంది. ప్రజల పక్షపాతిగా పీఎల్‌జీఏ తనను తాను నిరూపించుకుంది. ఇప్పటికీ అధిగమించాల్సిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి., చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారానే ఇది సాధ్యం. పొరపాట్లను తగ్గించుకుంటూ ఎక్కువ విజయాలు సాధించాలి. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు రూపొందించుకోవాలి. ఇందులో విసుగు చెందవద్దు. సామాజిక మార్పు వెంటనే సాధ్యం కాదు. పీఎల్‌జీఏ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీగా, గెరిల్లా యుద్ధం మొబైల్‌ యుద్ధంగా మారాలి’ అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని