ఉత్తరాంధ్రను ముంచెత్తిన వానలు

ప్రధానాంశాలు

ఉత్తరాంధ్రను ముంచెత్తిన వానలు

శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధికం

ఈనాడు, అమరావతి: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో తూర్పుపశ్చిమ ద్రోణి ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో శుక్రవారం నుంచి శ్రీకాకుళం జిల్లా మందస, టెక్కలి ప్రాంతాల్లో 18 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిశాయి. విజయవాడలో ఏకధాటిగాకురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 నుంచి శనివారం ఉదయం 8.30 మధ్య.. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 14 సెం.మీ., ఇచ్ఛాపురంలో 11, మందసలో 9, సోంపేటలో 8, టెక్కలిలో 8, కళింగపట్నంలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 మధ్య.. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 11.4, కొత్తపల్లిలో 10.2, శ్రీకాకుళం జిల్లా మందసలో 8.7, రాజాంలో 7.6, టెక్కలిలో 6.8 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా పలమనేరు, చిత్తూరు, పాకాలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.

తిరుపతిలో కుండపోత వర్షం

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, తిరుపతి(నగరపాలిక, జీవకోన), న్యూస్‌టుడే: తిరుపతిలో శనివారం కుండపోత వర్షం కురిసింది. రెండుగంటల పాటు కురిసిన వర్షానికి వీధులన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. నగరంలోని పలు కాలనీలు రాత్రి వరకు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని