డెంగీకి టీకా?

ప్రధానాంశాలు

డెంగీకి టీకా?

జపాన్‌ కంపెనీ ‘తకేడా’ ప్రయత్నాలు

భారత ఔషధ నియంత్రణ మండలితో సంప్రదింపులు

ప్రయోగాల దశలో దేశీయ కంపెనీలు

అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాంతకంగా మారే డెంగీ జ్వరానికి మన దేశంలో తొలిసారి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా తాను అభివృద్ధి చేసిన డెంగీ టీకాను మన దేశంలో విడుదల చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)తో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. దీనికి సానుకూల స్పందన లభిస్తే వెంటనే టీకా అందుబాటులోకి తీసుకురావటానికి తకేడా ఫార్మా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. డెంగీకి టెట్రావాలెంట్‌ లైవ్‌ అటెన్యుయేటెడ్‌ టీకా (టక్‌-003)ను ఈ ఔషధ సంస్థ అభివృద్ధి చేసింది. దీనికి అనుమతినివ్వాలని తకేడా ఫార్మా ఇప్పటికే పలు ఐరోపా దేశాల్లో దరఖాస్తు చేసింది. అదే సమయంలో వివిధ ఆసియా దేశాల్లో ఈ టీకా విక్రయానికి ప్రయత్నిస్తోంది. తకేడా ఫార్మా ప్రపంచవ్యాప్తంగా 20 పెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటి. క్యాన్సర్‌, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ ఔషధాలతోపాటు కొన్ని అరుదైన వ్యాధులకు మందులు ఆవిష్కరించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది.

టీకా కోసం ఎదురుచూపులు

డెంగీ టీకా కోసం మనదేశమూ ఎంతో కాలంగా ఎదురుచూస్తోంది. దీన్ని ఆవిష్కరించడానికి దేశీయ ఫార్మా/బయోటెక్‌ కంపెనీలు శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాయి. పానేషియా బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ తదితర దేశీయ సంస్థలన్నీ యూఎస్‌ ఎన్‌ఐహెచ్‌ (యూఎస్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌) నుంచి ‘నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌’ పద్ధతిలో టెట్రావ్యాక్స్‌-డివి అనే డెంగీ టీకా లైసెన్సు తెచ్చుకొని దాన్ని వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయోగాలు ‘ల్యాబ్‌’ దశలోనే ఉన్నాయి.

సనోఫీ ముందడుగు

ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ అనే సంస్థకు డెంగీ టీకాను తొలిసారిగా ఆవిష్కరించిన ఘనత దక్కుతుంది. ఈ కంపెనీ ‘డెంగ్‌వాగ్జియా’ అనే పేరుతో టీకాను ఆవిష్కరించింది. దీనికి సింగపూర్‌, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, పరాగ్వే, బ్రెజిల్‌, ఎల్‌సాల్వడార్‌, ఇండోనేషియా తదితర 10 దేశాలు అనుమతినిచ్చాయి. గతేడాది జనవరిలో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా సనోఫీ డెంగీ టీకాను తమ దేశంలో వినియోగించేందుకు కొన్ని పరిమితులకు లోబడి అనుమతినిచ్చింది. ఇదే టీకాకు మన దేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి తీసుకునేందుకు కొంతకాలంగా సనోఫీ ప్రయత్నిస్తోంది. ఈలోపు తకేడా ఫార్మా ముందుకొచ్చింది. అవసరమైతే మన దేశంలో పరిమితంగానైనా క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా డెంగీ టీకాకు అనుమతి సంపాదించాలని తకేడా ఫార్మా భావిస్తోందని సమాచారం. ఈ ఉద్దేశంతోనే ఈ సంస్థ డీసీజీఐని సంప్రదిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మనకి డెంగీ టీకా అందుబాటులోకి వచ్చినట్టే.


పెరుగుతున్న బాధితులు

దోమకాటుతో డెంగీ జ్వరం వ్యాపిస్తుంది. దేశీయంగా దీని బారినపడే వారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటోంది. డెంగీ మరణాల సంఖ్య మన దేశంలో ఏటేటా పెరుగుతోంది. పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌కు తోడు ఈశాన్య రాష్ట్రాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య ఎక్కువే. ఇదే సమయంలో డెంగీకి ప్రత్యేకంగా మందు లేదు. లక్షణాలనుబట్టి చికిత్స తీసుకోవాలి. అందుకే టీకా అందుబాటులోకి వస్తే ఈ ముప్పు తగ్గే అవకాశాలున్నాయి.

- ఈనాడు వాణిజ్య విభాగం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని