పెట్రోలు కంటే.. విమాన ఇంధనమే చౌక!

ప్రధానాంశాలు

పెట్రోలు కంటే.. విమాన ఇంధనమే చౌక!

పెట్రోలు, డీజిల్‌ లీటరు రూ.100 దాటగా..

ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ గరిష్ఠంగా రూ.83

ఈనాడు, వాణిజ్య విభాగం: పెట్రోల్‌..డీజిల్‌ కంటే విమాన ఇంధనమే చౌకా! ఆశ్చర్యపోకండి. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఇలాగే ఉంది. విమాన రాకపోకలకు వినియోగించే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) లీటరు ధర కంటే లీటరు  పెట్రోలు/డీజిల్‌ ధరే కనీసం రూ.20 కంటే అధికంగా ఉంది. కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో మాత్రం స్థిరంగా ఉంచిన చమురు విక్రయ సంస్థలు, మళ్లీ 14 నుంచి పెంచుతూపోతున్నాయి. వరుసగా నాలుగో రోజైన ఆదివారమూ పెంచాయి. ఫలితంగా దేశంలో లీటరు పెట్రోలు ధర ఎప్పుడో రూ.100 దాటగా, డీజిల్‌ ధర కూడా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.100 కంటే అధికంగా ఉంది. ఇదే సమయంలో దేశీయ విమానాల్లో నింపే ఏటీఎఫ్‌ కిలో లీటరు(1000 లీటర్ల) ధర గరిష్ఠంగా రూ.83,000 కావడం గమనార్హం. అంటే లీటరు ధర రూ.83 మాత్రమేనన్నమాట. దీన్నిబట్టి విమాన ఇంధనంతో పోలిస్తే.. సామాన్యులు వాడే పెట్రోలు, డీజిల్‌ ధరలు 30-33 శాతం అధికంగా ఉన్నట్టు లెక్క. అయినప్పటికీ కొవిడ్‌ ముందునాటి కంటే పెట్రో వినియోగం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోలు వినియోగం అప్పటికంటే 10-15 శాతం, డీజిల్‌ వినియోగం 6-10 శాతం వరకు అధికమైందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇటీవల వెల్లడించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని