25 నుంచి జోన్ల వారీగా తెదేపా ‘విద్యుత్‌’ నిరసనలు

ప్రధానాంశాలు

25 నుంచి జోన్ల వారీగా తెదేపా ‘విద్యుత్‌’ నిరసనలు

ఈనాడు, అమరావతి: పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌తో తెదేపా చేపట్టిన నెల రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా... ఈ నెల 25 నుంచి 29 వరకు జోనల్‌ స్థాయిలో వినూత్నంగా నిరసన తెలియజేయనుంది. ఈ నెల 1 నుంచి మొదలైన తెదేపా ఆందోళన కార్యక్రమాల మూడోదశలో భాగంగా... సోమవారం నుంచి శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు గ్రామాల్లోకి వెళుతున్నారు. ఈ నెల 23 వరకు ఒక్కో నియోజకవర్గంలో రోజుకి రెండు గ్రామాల చొప్పున... ఆరు రోజుల్లో మొత్తం 12 గ్రామాల్లో పర్యటించనున్నారు. సోమవారం 364 గ్రామాలను సందర్శించారు. గ్రామ సమావేశాల్లో మాట్లాడారు. కొన్ని చోట్ల ఫ్యాన్లు చేతితో పట్టుకుని... జగన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఫ్యాన్లు తిరగడం లేదంటూ నిరసన తెలిపారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక విద్యుత్తు బిల్లులు కట్టలేక ఇళ్లల్లో గుడ్డి దీపాలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆందోళన కార్యక్రమాల్లో తెదేపా ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు ఇవే
* ట్రూఅప్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలి.
* వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వెంటనే విరమించుకోవాలి.  
* జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్‌ ఛార్జీలు పెంచకూడదు. ఇప్పటివరకు వసూలు చేసిన అదనపు ఛార్జీలు వెనక్కు ఇవ్వాలి.
* ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
* ప్రభుత్వరంగ సంస్థలు డిస్కంలకు బకాయి ఉన్న రూ.10,800 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
* ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యుత్‌ సంస్థల సామర్థ్యం మేరకు పూర్తిగా ఉత్పత్తి చేయాలి.
* బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయరాదు.

జోన్ల వారీగా లోక్‌సభ నియోజకవర్గాల్లో నిరసనలు ఇలా..!
అక్టోబరు 25న జోన్‌-1 (అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి)
అక్టోబరు 26న జోన్‌-5 (నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప)
అక్టోబరు 27న జోన్‌-2 (అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు)
అక్టోబరు 28న జోన్‌-4 (ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట, తిరుపతి)
అక్టోబరు 29న జోన్‌-3 (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల)

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని