భారత సేన జోలికొస్తే షాకే!

ప్రధానాంశాలు

భారత సేన జోలికొస్తే షాకే!

చైనాను ఎదుర్కొనేందుకు సరికొత్త ఆయుధాలు సిద్ధం

దిల్లీ: సరిహద్దులు దాటి వచ్చి బాహాబాహీకి దిగే చైనా సైన్యానికి చెక్‌ పెట్టేందుకు భారత్‌ రంగం సిద్ధం చేసింది. హద్దు మీరే శత్రువుకు కొర్రుకాల్చి వాత పెట్టే సాధనాలు తయారయ్యాయి. శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలగాలకు ఆయుధంగా మారింది. కొత్తగా రూపొందిన గ్లౌజులు తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే.. చైనా సైనికుడికి దిమ్మతిరిగిపోతుంది. నయా లాఠీలు తాకితే చాలు.. డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. ప్రత్యర్థి ప్రాణాలకు హాని కలిగించని ఈ సాధనాలు.. షాక్‌ కలిగిస్తాయి. సరిహద్దుల్లో తుపాకులను పేల్చకూడదని భారత్‌, చైనాల మధ్య ఒప్పందం ఉంది. గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ సేన.. మన సైనికులపై ఇనుప రాడ్లు, ఇనుప ముళ్లు, షాక్‌ కలిగించే టేజర్లు వంటి ఆయుధాలతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో శత్రువుకు ప్రాణహాని కలిగించని అస్త్రాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వాటిని తయారుచేసే బాధ్యతను నోయిడాలోని అపాస్టెరాన్‌ అనే అంకుర సంస్థకు  అప్పగించింది. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా.. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా వీటిని ఆ సంస్థ తయారుచేసింది.

త్రిశూల్‌

శివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా దీన్ని రూపొందించారు. గల్వాన్‌ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని.. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్‌ తెలిపింది. ఇది బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. విద్యుత్‌ ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఫలితంగా ప్రత్యర్థి సెకన్లలోనే షాక్‌కు గురవుతాడు.

వజ్ర

ఇది బ్యాటరీ సాయంతో పనిచేసే లోహపు కడ్డీ. విద్యుత్‌ను విడుదల చేయడం ద్వారా షాక్‌ కలిగిస్తుంది. దీనివల్ల శత్రువు కొద్దిసేపు అపస్మారక స్థితిలోకి జారిపోతాడు. దీనిపై ముళ్లు లాంటి ఆకృతులు ఉంటాయి. ఇవి శత్రు వాహనాలు, ఆయుధాలను నాశనం చేయగలవు. తూటా రక్షక వాహనాలకూ పంక్చర్‌ చేయగలవు.

శాపర్‌ పంచ్‌

ఇవి విద్యుత్‌ ప్రవాహంతో కూడిన ప్రత్యేక గ్లౌజులు. ముఖాముఖీ తలపడినప్పుడు శత్రువును దెబ్బతీయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని సాయంతో ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించినప్పుడు అతడు షాక్‌కు లోనవుతాడు. ఒకసారి ఛార్జి చేస్తే ఇది 8 గంటల వరకూ పనిచేస్తుంది. నీటిలో పడినా దెబ్బతినదు.

దండ్‌

ఇది బ్యాటరీ సాయంతో పనిచేసే విద్యుత్‌ కర్ర. ఇది కూడా షాక్‌ కలిగిస్తుంది. ఇందులో ఒక బటన్‌ ఉంటుంది. దాన్ని పనిచేయించడానికి మరో సేఫ్టీ స్విచ్‌ అవసరం. ఒకవేళ శత్రువు దీన్ని లాక్కొని వెళ్లినా అది అతడికి ఉపయోగపడదు. విడిగా ఉండే సేఫ్టీ స్విచ్‌ తోడ్పాటు లేకుండా ఇది పనిచేయదు.

భద్ర

ఇది ఒకరకమైన రక్షణ కవచం. రాళ్ల దాడి నుంచి మన సైనికుడిని కాపాడుతుంది. ఇది కళ్లు మిరుమిట్లుగొల్పే కాంతిని కూడా వెలువరిస్తుంది. ఫలితంగా శత్రు సైనికుడికి కొద్దిసేపు కళ్లు కనిపించవు. దీన్ని తాకిన ప్రత్యర్థికి షాక్‌ కలుగుతుంది.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని