రాష్ట్రంలో ‘వెనెజువెలా’ పరిస్థితులు

ప్రధానాంశాలు

రాష్ట్రంలో ‘వెనెజువెలా’ పరిస్థితులు

వ్యక్తిగత ప్రతిష్ఠకు అభివృద్ధి తాకట్టు
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు విమర్శ

ఈనాడు, అమరావతి: వెనెజువెలా దేశంలో ఏర్పడిన కరవు పరిస్థితులు రాష్ట్రంలోనూ తలెత్తే అవకాశం ఉందని భాజపా రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌, మేధావి విభాగం ఇన్‌ఛార్జి ఛైర్మన్‌, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఐదేళ్లు అధికారంలో కొనసాగాలనుకునే వారు ఇలా చేయబోరని వ్యాఖ్యానించారు. రికార్డుల్లో నమోదుకాని అప్పు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని విమర్శించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర పరిస్థితులను చూస్తే ఇక అప్పు కూడా దొరకదు. రాష్ట్రం నెత్తిన ఉన్న రూ.5లక్షల కోట్లు అప్పునెలా తీరుస్తారు? ఆర్థిక వనరులు పెరుగుతాయా? పెరిగేందుకు అవకాశముందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇటీవలి కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.1.53 లక్షల కోట్ల అప్పు చేశారు. జగన్‌ రెండేళ్లలో రూ.1.45 లక్షల కోట్ల అప్పు చేశారు. రికార్డుల్లో చూపని అప్పులు మరో రూ.2 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25% వరకు అప్పు తీసుకునే అవకాశం ఉంటే, ప్రభుత్వం ఇప్పటికే 37% అప్పు చేసింది. ఖాళీ ఖజానాతో ఉన్న ప్రభుత్వానికి మూలధన వ్యయం కోసం నిధులెలా వస్తాయి? ప్రభుత్వ ఆదాయంలో జీతాలు, పింఛన్లు, వడ్డీలు కలిపి 35% తప్పనిసరిగా ఖర్చుచేయాలి. మిగతా 65%పై స్వీయనియంత్రణ లేనట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా తయారవుతుంది. డబ్బు ఎందుకు పంచుతున్నారు? ఎంతకాలం పంచుతారు? దీనిపై ప్రజలు ఆలోచించాలి. కేంద్రం అప్పులు చేస్తోందని వాదించడం సరైనది కాదు. వారు ఎంత చేస్తున్నారు? ఎందుకనేది ముఖ్యం’ అని పేర్కొన్నారు.

ఇనుము, సిమెంటునూ అప్పుగా...

గృహనిర్మాణాలకు ఇనుము, సిమెంటు అప్పుగా ఇవ్వాలని విక్రేతలను కావలి ఆర్డీవో అడిగినట్లు తన దృష్టికి వచ్చిందని ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు. ‘ఆసుపత్రుల్లో దూది, దారం లేకుండాపోయింది. బడ్జెట్లో నిధులన్నీ సంక్షేమానికే వెచ్చిస్తే మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తారు?’ అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో భూవివాదాలు రెవెన్యూ శాఖ వారి వల్లనే వస్తున్నాయి. ప్రైవేటు భూములను నిషిద్ధ జాబితాలో అనవసరంగా చేర్చేస్తున్నారు. సులువుగా పరిష్కరించాల్సిన సమస్యలను క్లిష్టతరం చేస్తున్నారు. సీఎం స్థాయిలో కమిటీని ఏర్పాటుచేసి ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి’ అని పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని