కులగణన లేకపోవడం అన్యాయం

ప్రధానాంశాలు

కులగణన లేకపోవడం అన్యాయం

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా బీసీలను కులాల వారీగా లెక్కించాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. బీసీల అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వారంతా పేదరికంలో మగ్గుతున్నారని, ఇందుకు ప్రధాన కారణం వారి జనాభాపై తగిన సమాచారం లేకపోవడమేనని ఆందోళన వ్యక్తంచేశారు. సమ సమాజం వైపు అడుగులు వేస్తున్నామని నిర్ధారించేందుకు... బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కులగణన ముఖ్యమన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ‘‘దేశ జనాభాలో బీసీలే ఎక్కువ శాతమున్నా... వారి నిష్పత్తికి అనుగుణంగా సమాన ప్రయోజనాలు అందక, నిర్లక్ష్యానికి గురైన వర్గంగా మిగిలిపోతున్నారు. కులాల వారీ జనాభా లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో వారు వివక్షకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనా కులాలవారీగా జనాభాను లెక్కించకపోవడం కుల వివక్ష తరహాలో అన్యాయం’’ అని పేర్కొన్నారు.

జాబితాను కాలానుగుణంగా సవరించాలి

‘‘బీసీలకు వృత్తిపరమైన కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక, విద్యాపరంగా వారి అభ్యున్నతికి ప్రత్యేక నిబంధనలు అమలు చేయవచ్చు. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం సరైన ప్రాతినిథ్యం లేని సమయంలో రాష్ట్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగంలోని 16(4) అధికరణ చెబుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ వివిధ రంగాల్లోని బీసీల ప్రాతినిథ్య నిష్పత్తిని అర్థం చేసుకోవడానికి జనాభాను లెక్కించడం ఎంతో అవసరం. దీంతోపాటు బీసీ జాబితాను కాలానుగుణంగా సవరించాలి. జాతీయ బీసీ కమిషన్‌ చట్టం-1933లోని సెక్షన్‌ 11ను 2018లో రద్దు చేసినా అందులో ఒక విషయం స్పష్టంగా ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చి పదేళ్ల గడువు ముగిసిన తర్వాత... కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు బీసీ జాబితాను సవరించాలి. కొత్త కులాలను చేర్చేలా సవరణ చేయొచ్చు అని ఉంది’’ అని చంద్రబాబు లేఖలో కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని