కొనసాగిన హైడ్రామా

ప్రధానాంశాలు

కొనసాగిన హైడ్రామా

నక్కా ఆనందబాబు స్టేట్మెంట్ రికార్డుతో సంతృప్తి చెందని పోలీసులు
నోటీసులు ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పట్టాభిపురం: గుంటూరులో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రోజంతా హైడ్రామా కొనసాగింది. గంజాయి రవాణాపై ఆనందబాబు చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు కోరుతూ నోటీసులు ఇవ్వడానికి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు ఇక్కడకు వచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 91 కింద నోటీసులు ఇవ్వడానికి వారు సిద్ధం కావడంతో తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ని అరెస్టు చేస్తారేమోనని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మళ్లీ మంగళవారం ఉదయం నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావుతో పాటు గుంటూరు పట్టాభిపురం సీఐ రాజశేఖరరెడ్డితో కలిసి ఆనందబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఆనందబాబు నుంచి సీఐ శ్రీనివాసరావు స్టేట్మెంట్ రికార్డు చేశారు. దానితో సంతృప్తి చెందని పోలీసులు నోటీసులిచ్చేందుకు సిద్ధమయ్యారు. స్టేట్మెంట్ రికార్డు చేసి నోటీసులు ఏ విధంగా ఇస్తారని ఆనందబాబు వారిని ప్రశ్నించారు. గోడకు అంటించి వెళ్తామని పోలీసులు తెలిపారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్తో సంతృప్తి చెందలేదని సంతకం పెట్టి ఇవ్వమని ఆయన కోరగా... అందుకు పోలీసులు అంగీకరించలేదు. నోటీసులు తీసుకోనని ఆనందబాబు స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

అర్ధరాత్రి వచ్చి ఆధారాలు అడగడమేమిటి?

తన స్టేట్మెంట్తో సంతృప్తి చెందలేదని పోలీసులు చెప్పడం వింతగా ఉందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ‘ అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రలేపి ఆధారాలు ఇవ్వాలని అడగడమేమిటి? ఆధారాలు ఇవ్వకపోతే నోటీసులు ఇస్తారా....కేసులు పెడతారా? ఏదో ఒక విధంగా బెదిరించాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు’ ఆయన పేర్కొన్నారు. గుంటూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ దళిత నేత అయినందునే ఇంతసేపు హింసిస్తారా? అని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ దళిత నేత అయిన మాజీ మంత్రిని ఆధారాలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టడం సహేతుకమేనా? అని ప్రశ్నించారు.


సాక్షిగానే విచారించాం 
మరో ఇద్దరు మాజీ మంత్రులకు నోటీసులిస్తాం: విశాఖ రేంజి డీఐజీ

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ ఏజెన్సీలో గంజాయి రవాణాకు మాఫియాతో స్థానిక నాయకులతో సంబంధం ఉందని తెదేపా నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు బహిరంగంగా ప్రకటించడంతోనే సాక్షిగా విచారించడానికి నోటీసులు జారీ చేసినట్లు విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు వెల్లడించారు. ‘మాఫియా ఎవరు?, వారితో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అని అడిగాం. ఆయన సరైన వివరాలేవీ ఇవ్వలేదు.  పూర్తి సమాచారం ఇవ్వాలని అడిగాం’ అని డీఐజీ వివరించారు. గంజాయి మాఫియాపై మాట్లాడిన మరో ఇద్దరు మాజీ మంత్రులకు నోటీసులు ఇస్తామన్నారు. తెలంగాణ పోలీసులు రెండు మూడు వారాల నుంచి ఇక్కడ తమ సిబ్బంది సహకారంతోనే కొందరిని అదుపులోకి తీసుకున్నారని డీఐజీ రంగారావు వెల్లడించారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని